ఇందిరా గాంధీపై సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

16 Jan, 2020 12:07 IST|Sakshi

ముంబై: దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీపై శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ ముంబైకి వచ్చినపుడల్లా ఆనాటి డాన్‌ కరీం లాలాను తరచుగా కలిసేవారని పేర్కొన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ... అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో చాలాసార్లు మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. ‘ ఒకప్పుడు.. ముంబై పోలీసు కమిషనర్‌గా ఎవరు ఉండాలి... మంత్రాలయం(అసెంబ్లీ)లో ఎవరు కూర్చోవాలి అనే విషయాలను దావూద్‌ ఇబ్రహీం, ఛోటా షకీల్‌, శరద్‌ శెట్టి నిర్ణయించేవారు. ఇందిరా గాంధీ కూడా తరచుగా కరీం లాలాను కలిసేవారు. అండర్‌ వరల్డ్‌ ఎలా ఉంటుందో మేమంతా చూశాం. కానీ ఇప్పుడు ఇదంతా చాలా చిల్లర వ్యవహారంగా అనిపిస్తోంది’ అని అన్నారు. అదే విధంగా తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇందిరా గాంధీ, నెహ్రూ, రాజీవ్‌ గాంధీ సహా గాంధీ కుటుంబంలోని అందరిపై తనకు గౌరవ భావం ఉండేదని పేర్కొన్నారు. ఇందిరా గాంధీపై విమర్శలు వచ్చిన ప్రతీసారీ తాను ఆమెకు మద్దతుగా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు.

ఇక ముంబై పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘ కరీం లాలాను కలవడానికి ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చేవారు. అతను ఆఫ్గనిస్తాన్‌ నుంచి వచ్చిన పఠాన్‌ వర్గ నాయకుడు. కాబట్టి వారి వల్ల తలెత్తుతున్న సమస్యల గురించి వివరించేందుకు అతడిని కలిసేవారు. అంతేకాదు దావూద్‌ ఇబ్రహీంతో నేను ఓ సారి ఫొటో సెషన్‌ ఏర్పాటు చేశాను. దావూద్‌ను నేరుగా చూసిన అత్యంత తక్కువ మందిలో నేనూ ఒకడిని. తనతో చాలాసార్లు మాట్లాడాను కూడా. అయితే కొన్నిసార్లు అతడి నుంచి బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాను’ అని సంజయ్‌ రౌత్‌ చెప్పుకొచ్చారు. కాగా స్మగ్లింగ్‌, గ్యాంబ్లింగ్‌, కిడ్నాపులు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలతో ముంబైను దాదాపు రెండు దశాబ్దాల పాటు వణికించిన కరీం లాలా(90) 2002లో మరణించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు