'శరద్ పవార్‌పై మాకు ఎలాంటి అనుమానం లేదు'

19 Nov, 2019 12:26 IST|Sakshi

ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 27 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నవంబర్‌ 12 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వ  ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం శివసేనతో కలిసి ఎన్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని చెప్పి షాక్ ఇచ్చారు. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ నుండి వస్తుందో ఆ పార్టీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో సమావేశం తరువాత పవార్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. మహారాష్ట్రలో డిసెంబరు మొదటి వారంలో శివసేన అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో.. తాము త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రైతుల సమస్యలను గురించి వివరిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతోన్న తరుణంలో తమ పార్టీని ఎన్డీఏ నుంచి తొలగించడంపై బీజేపీపై శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తున్న సమయంలో బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతోనే ఆ పార్టీ తీరు ఎలాంటిదో స్పష్టమైందని తెలిపారు. 288 అసెంబ్లీ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు