సోనూ‌కు రాజకీయ రంగు: మోదీతో భేటీ!

7 Jun, 2020 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై : కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌పై శివసేన విమర్శల వర్షం కురిపించింది. తన అధికారిక పత్రిక సామ్నా వేదికగా ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ సోనూను రాజకీయ రొచ్చులోకి లాగారు. వలస కార్మికులను అడ్డుపెట్టుకుని మరో మహాత్ముడు దిగి వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనూ మంచి నటుడని కితాబిస్తూనే.. ఆయన వెనుక మంచి దర్శకులు కూడా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సోనూసుద్‌ సహాయంలో ఎన్నో లోతుపాతులు ఉన్నాయని, త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారంటూ రాజకీయ రంగు పూశారు. ఈ మేరకు ఆదివారం సామ్నా ఎడిటోరియల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. (28 వేల మందికి సోనూసూద్‌ సాయం)

‘వలస కార్మికులకు మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ అండగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సొంత ఖర్చుతో నటుడు సోనూసుద్‌ కొంతమంది కార్మికులను వారి స్వస్థలాలకు పంపించారు. ఆయన సహాయం వెనుక స్థానిక ప్రభుత్వ సహకారం కూడా ఉంది. సోనూ కార్యక్రమాల్లో రాజకీయ కోణం కూడా దాగి ఉంది. ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు నిలవడమే దీనికి నిదర్శనం. వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసుద్‌ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడం ఖాయం. సోనూ సెలబ్రిటీ మేనేజర్‌ ఆఫ్‌ ముంబై’ అంటూ సంజయ్‌ రౌత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాగా లాక్‌డౌన్‌ కారణంగా మహారాష్ట్రలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తనసొంత ఖర్చులతో స్వస్థలాలకు తరలించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నిసర్గ తుపాను ముంచుకొస్తున్న సమయంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.సోనూ సహాయం దేశంలో నిజమైన హీరోగా ఆయన్ని నిలబెట్టిందంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, త్రిపుర సీఎం బిప్లద్‌ దేవ్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సైతం సోనూను అభినందనల్లో ముంచెత్తారు. తెరపై చేసే సాహసాల కంటే నిజ జీవితంలో ప్రజలను ఆదుకునేవారే నిజయమైన హీరో అంటూ కొనియాడారు. (సోనూసూద్‌.. నువ్వు రియల్‌ హీరో)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా