అయ్యన్నకు తమ్ముడు ఝలక్‌ !

5 Nov, 2019 12:37 IST|Sakshi
సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం విజయసాయిరెడ్డితో కలిసి వస్తున్న సన్యాసిపాత్రుడు

కుటుంబ కలహాలు సరిదిద్దడంలో అయ్యన్న పాత్రుడు వైఫల్యం

అన్నతో పొసగక పార్టీ మారిన సోదరుడు సన్యాసిపాత్రుడు

ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక

విశాఖపట్నం,నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు వైఎస్సార్‌సీపీలో చేరడంతో నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాంతంలో పట్టుఉన్న సన్యాసిపాత్రుడు పార్టీ మారడంతో మున్సిపాలిటీలో టీడీపీ కోటకు బీటలు వారినట్లైంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి టీపీపీలో కొనసాగుతూ అన్నయ్య అయ్యన్నపాత్రుడు కుడిభుజంగా ఉంటూ వచ్చిన ఈయన కొంత కాలంగా బాబాయ్‌–అబ్బాయి విజయ్‌ మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా టీడీపీకి, అయ్యన్నపాత్రుడుకి దూరంగా ఉన్నారు. కుటుంబ కలహాలు తారస్థాయికి చేరడం, వీటిని పరిష్కరించడంలో అయ్యన్నపాత్రుడు విఫలం కావడంతో టీడీపీని వీడాలని సన్యాసిపాత్రుడు, అతని అనుచరులు నిర్ణయానికి వచ్చారు. సెప్టెంబర్‌ నాలుగో తేదీన సన్యాసిపాత్రుడు జన్మదినోత్సవం రోజున అతనితోపాటు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అనిత, పలువురు మాజీ కౌన్సిలర్లు, కొంతమంది నాయకులు టీడీపీకి రాజీనామాలు చేశారు.

అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలతో చర్చించి తేదీని ఖరారు చేశారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి సన్యాసిపాత్రుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మూడున్నర దశబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సన్యాసిపాత్రుడు పలు కీలక పదువులను నిర్వహించారు. మూడు దపాలు నర్సీపట్నం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా, ఒక దఫా ఆయన సతీమణి అనిత మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా, ఆయన వైస్‌చైర్మన్‌గా పదవులు చేపట్టారు. నియోజకవర్గంలో గట్టి అనుచరగణం కలిగిన సన్యాసిపాత్రుడు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పార్టీకి ఇక్కడ మరింత బలం చేకూరింది. మాజీ మంత్రి అయ్యన్నకు అండదండగా ఉంటూ ప్రధానంగా మున్సిపాలిటీలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే సన్యాసిపాత్రుడు టీడీపీకి, అయ్యన్నకు దూరం కావడం భారీ నష్టంగా పలువురు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు