3 నుంచి సత్యాగ్రహం!

28 Sep, 2017 01:50 IST|Sakshi

జేఏసీ చైర్మన్‌ కోదండరాం

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను ఓడించాలని పిలుపు

జీవో 39తో స్థానిక సంస్థలు నిర్వీర్యం: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌ 3వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల ముందు ‘సత్యాగ్రహం’పేర కార్యక్రమాలు నిర్వహించనున్నామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రకటించారు. రైతు సమన్వయ సమితులు రద్దు కావాలని, గ్రామ పంచాయతీలు బలపడాలని ఆకాంక్షించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ, సీపీఐ నేతలతో కలసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్‌ 3న నిరసనలు ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి అఖిలపక్షం ఇచ్చిన పేరు ‘సత్యాగ్రహం’అని పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను ఓడించాలని పిలుపు ఇచ్చారు.

గనుల ప్రైవేటీకరణ రద్దుతోపాటు వారసత్వ ఉద్యోగాలను సాధించాలంటే అధికార పక్షానికి వ్యతిరేక ఓటు వేయాలని కోరారు. వారసత్వ ఉద్యోగాలను కోర్టు వ్యతిరేకించలేదని, మహిళలు, వికలాంగుల పట్ల వివక్షనే తప్పుబట్టిందని వివరించారు. అధికారం కోసం ఎన్నికలను టీఆర్‌ఎస్‌ భ్రష్టు పట్టించిందని, అధికార పార్టీ అనుబంధ సంఘం విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తోందని మండిపడ్డారు. ఇతర సంఘాల్లో రెండో శ్రేణి నేతలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, రైతు సమన్వయ సమితుల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం, సభ్యత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. జీవో 39 స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేదిగా ఉందని, ఇది అప్రజాస్వామికమైన జీవో అని మండిపడ్డారు. గ్రామాల్లో రైతు సమన్వయ సమితులు ఘర్షణ సమితులుగా మారాయన్నారు. రైతు సమన్వయ సమితుల పేరున టీఆర్‌ఎస్‌ గ్రామాల్లో చిచ్చు పెడుతోందని సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. జేఏసీ తలపెట్టిన నిరసనలు, ధర్నాలకు సీపీఐ మద్దతు పలికినట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డులు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు