‘బురిడీ బాబు’పై కేసు పెడదామా..వద్దా..!

26 Dec, 2018 04:24 IST|Sakshi

ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ వ్యవహారంలో ఎస్‌బీఐ అధికారుల తర్జనభర్జన

బ్యాంకును మోసం చేసినట్లు ఎమ్మెల్సీపై కేసు పెట్టాలని తొలుత నిర్ణయం

చీటింగ్‌ కేసు నమోదు చేయకుంటే తాము ఇరుక్కుంటామని అధికారుల ఆందోళన

కేసు పెట్టకుండా ఎస్‌బీఐ అధికారులపై ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి 

రుణం వసూలు చేసుకొని,‘లోన్‌ అకౌంట్‌’ మూసేయాలని న్యాయ నిపుణుల సూచన

సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బ్యాంకును బురిడీ కొట్టించిన కేసు వివాదం నుంచి ఎలా బయటపడాలనే దానిపై ఎస్‌బీఐ ఉన్నతాధికారులు మూడు రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. రూ.24 కోట్ల రుణం మంజూరు చేసే ప్రక్రియలో కిందిస్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టించారని, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నమ్మించారని, అందువల్ల లోతుగా పరిశీలించకుండానే రుణం మంజూరు చేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. రుణం కోసం అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బ్యాంకుకు సమర్పించిన 11.66 ఎకరాలకు సంబంధించిన పత్రాల్లో ‘లింకు డాక్యుమెంట్లు’ లేవని బ్యాంకు సిబ్బందికి స్పష్టంగా తెలుసని వివరించారు. ఆస్తుల తనఖాకు ఆధారంగా సమర్పించిన ‘టైటిల్‌ డీడ్స్‌ డిపాటిట్‌’లో కేవలం రిజిస్ట్రేషన్లు, తప్పుడు 1బీ పత్రం సమర్పించడం వరకే ఎమ్మెల్సీ పరిమితమయ్యారు. ఒక్క ఎకరాకు కూడా లింక్‌ డాక్యుమెంట్లు(ఎమ్మెల్సీకి విక్రయించిన వారికి భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని నిర్ధారించే పత్రాలు) సమర్పించలేదు.

బ్యాంకుకు సమర్పించిన భూముల పత్రాలన్నీ 2015–17 మధ్య రిజిస్ట్రేషన్లు చేసినవే కావడం గమనార్హం. తమకు వారసత్వంగా భూమి వచ్చినట్లుగా ఎమ్మెల్సీకి భూములు విక్రయించిన వారు రిజిస్ట్రేషన్ల పత్రాల్లో రాశారు. వారి వారసులకు ఉన్న భూయాజమాన్య హక్కు పత్రాలను గానీ, ‘సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌’లో వారి వివరాలను చూసి గానీ బ్యాంకు అధికారులు నిర్ధారించుకోలేదు. సామాన్యులు బ్యాంకు రుణం కోసం వెళితే ఇవన్నీ పక్కాగా చూస్తారు. ఏ ఒక్క డాక్యుమెంట్‌ లేకపోయినా రుణం ఇవ్వరు. కానీ, ఎస్‌బీఐ అధికారులు ఇవేమీ చూడకుండానే అధికార పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు చెందిన ‘సతీష్‌ మెరైన్‌ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు రూ.24 కోట్ల రుణం మంజూరు చేశారు. తొలి విడతగా అందులో రూ.5 కోట్లు రుణం విడుదల చేశారు. 

ఆగమేఘాలపై రుణం విడుదల
ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ భూములు, ఇతర ఆస్తులను బ్యాంకుకు తనఖా (మార్ట్‌గేజ్‌ ఆఫ్‌ డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌) పెట్టి 2018 అక్టోబర్‌ 8 రిజిస్ట్రేషన్‌ చేయించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత రుణం విడుదల చేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఎస్‌బీఐ బాపట్ల శాఖ అందుకు భిన్నంగా వ్యవహరించింది. అక్టోబర్‌ 8న డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌ రిజిస్ట్రేషన్‌కు నెల రోజుల ముందుగానే.. అంటే సెప్టెంబర్‌ నుంచే రుణం విడుదల చేయడం ప్రారంభించారు. 

అధికారులందరికీ లోగుట్టు తెలియదు 
ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు రుణం మంజూరులో ‘లోగుట్టు’ బ్యాంకు అధికారులందరికీ తెలియదనే అభిప్రాయం బ్యాంకు వర్గాల్లో ఉంది. విచారణ జరిగితే తామంతా ఇరుక్కుంటామని, ఈ వివాదం నుంచి బయటపడాలంటే... బ్యాంకును మోసం చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌పై చీటింగ్‌ కేసు పెట్టాలని అధికారులు తొలుత నిర్ణయించారు. అయితే ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి రావడంతో చీటింగ్‌ కేసు విషయంలో తర్జనభర్జన జరిగింది. చీటింగ్‌  కేసు నమోదు చేయకుండా ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.5 కోట్ల రుణాన్ని తక్షణం తిరిగి చెల్లిస్తే, తనఖా పెట్టిన డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చేసి ‘లోన్‌ అకౌంట్‌’ను మూసేస్తామని, వివాదం సమసిపోతుందని బ్యాంకు ఉన్నతాధికారులు మధ్యేమార్గంగా ‘ఒత్తిడి చేసిన పెద్దలకు’ సూచించారని తెలిసింది. ఈ వివాదంలో బ్యాంకు ఉన్నతాధికారులు న్యాయ సలహా కూడా తీసుకున్నారు. ఇచ్చిన రుణం వసూలు చేసుకొని, ‘లోన్‌ అకౌంట్‌’ మూసేయడమే ఉత్తమమని న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. 

1బీ చేతికందిన రోజే ఎమ్మెల్సీకి రిజిస్ట్రేషన్‌ 
ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు భూములు రిజిస్ట్రేషన్‌ చేయించిన రోజే రైతులకు 1బీ పత్రాలు జారీ కావడం గమనార్హం. అంటే ఇటు చేతిలో 1బీ పత్రం తీసుకొని.. అటు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూవిక్రయ పత్రాలపై సంతకాలు చేశారన్నమాట. ఉదాహరణకు 387/3 సర్వే నంబర్‌లో 1.06 ఎకరాలకు సంబంధించిన 1బీ పత్రం రైతుకు 2016 మార్చి 3న జారీ అయింది. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు రిజిస్ట్రేషన్‌(డాక్యుమెంట్‌ నంబర్‌ 1017/2016) చేయించిన తేదీ కూడా అదే కావడం గమనార్హం. 287/2 సర్వే నంబరు రైతుకు 2016 మార్చి 2న 1బీ పత్రం వస్తే.. అదే రోజు ఎమ్మెల్సీకి విక్రయిస్తూ రిజిస్ట్రేషన్‌ (డాక్యుమెంట్‌ నంబర్‌ 1016/2016) చేశారు. ఇలాంటి విషయాలను బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు.

మరిన్ని వార్తలు