రాహుల్‌కు సుప్రీం నోటీసులు

16 Apr, 2019 04:03 IST|Sakshi

మా తీర్పునకు రాహుల్‌ తప్పుడు ఆరోపణలు ఆపాదించారు

రాహుల్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను మేం ప్రస్తావించనే లేదు

ఈ నెల 22లోగా వివరణకు ఆదేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ‘ప్రధాని మోదీ దొంగ అని సుప్రీంకోర్టే చెప్పింది’ అన్న వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీచేసింది. రఫేల్‌ తీర్పునకు రాహుల్‌ తప్పుడు ఆరోపణల్ని ఆపాదించారని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలకు ఏప్రిల్‌ 22లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రఫేల్‌ ఒప్పందంపై లీకైన పత్రాల ఆధారంగా గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం ఈ నెల 10న అంగీకరించిన సంగతి తెలిసిందే. అదేరోజు అమేథీలో నామినేషన్‌ దాఖలుచేసిన అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘చౌకీదార్‌(కాపలాదారు–మోదీ) దొంగ అని సుప్రీంకోర్టు చెప్పింది. మోదీ దొంగతనానికి పాల్పడ్డారని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. సత్యమే గెలిచింది’ అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీం తీర్పునకు రాహుల్‌ తన అభిప్రాయాన్ని ఆపాదించారని ఆరోపించారు.

రఫేల్‌ పత్రాలపైనే చర్చించాం
ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం స్పందిస్తూ..‘రఫేల్‌ వ్యవహారంలో రాహుల్‌ గాంధీ తన ప్రసంగాలు, మీడియా సమావేశాల్లో తప్పుడు ఆరోపణలను సుప్రీం తీర్పునకు ఆపాదించారు. అంతేకాకుండా రాహుల్‌ ప్రస్తావించిన కొన్ని వ్యాఖ్యల్ని మేం అసలు చెప్పనేలేదు. మేం కేవలం లీకైన రఫేల్‌ పత్రాల చట్టబద్ధతపైనే చర్చించాం. కాబట్టి ఈ విషయంలో స్పష్టత కోసం రాహుల్‌ గాంధీ నుంచి వివరణ కోరడమే సరైనదని భావిస్తున్నాం’ అని తెలిపింది. ఈ కేసులో ఏప్రిల్‌ 23న తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది.

రాజకీయ నేతలు న్యాయస్థానాల తీర్పులకు ఎలాంటి అభిప్రాయాలను ఆపాదించరాదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా మీనాక్షి లేఖీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదిస్తూ.. సుప్రీంకోర్టును ప్రస్తావిస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేందుకు రాహుల్‌ ప్రయత్నించారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కారానికి పాల్పడటమేననీ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయంలో రాహుల్‌ వివరణను తీసుకుంటామని పునరుద్ఘాటించింది. ఈ కేసులో అదనపు అఫిడవిట్‌ దాఖలుచేసేందుకు అనుమతిస్తున్నామని పేర్కొంది.

రాహుల్‌ అబద్ధాల కోరు: బీజేపీ
పదేపదే అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌కు అలవాటైపోయిందని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా విమర్శించారు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో మోదీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రాహుల్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్‌ డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కేవలం అబద్ధాలు చెప్పడమే కాకుండా తన ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలను రాహుల్‌ వివాదంలోకి లాగారన్నారు. మోదీ పారదర్శక పాలన అందిస్తుంటే, కుంభకోణాల్లో మునిగితేలిన కాంగ్రెస్‌ పార్టీ తట్టుకోలేకపోతోందని దుయ్యబట్టారు.

సుప్రీంకు వివరణ ఇస్తాం: కాంగ్రెస్‌
రాహుల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఈ విషయమై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ..‘రాహుల్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. వాళ్లకు మేం వివరణ ఇస్తాం’ అని ముక్తసరిగా జవాబిచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ స్పందిస్తూ..‘సుప్రీంకోర్టు నోటీసుపై సమగ్రంగా, గట్టిగా జవాబు ఇస్తాం. ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం రాహుల్‌కు లేనప్పటికీ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది ఎంతమాత్రం సరికాదు’ అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌