వాసుపల్లిపై రణం

26 Apr, 2018 11:58 IST|Sakshi
రాజీకొచ్చిన వారితో సంతకాలు చేయించుకుంటున్న వాసుపల్లి అనుచరులు

కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీ కేసు

మానవహక్కుల సంఘానికి,  టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు

పార్టీ నేత కనకరాజు మృతికి కూడా ఎమ్మెల్యేనే కారణమని తీవ్ర ఆరోపణలు

వాసుపల్లి లొల్లి అధికార టీడీపీలో పెను దుమారం రేపుతోంది..దక్షిణ ఎమ్మెల్యేగా, పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న ఆయనపై సొంత పార్టీలోని దళితులే తిరుగుబాటు బావుటా ఎగరేసే పరిస్థితికి ఆయన వ్యవహారశైలే కారణమన్నది స్పష్టం.నోటి దురుసు, అనాలోచిత నిర్ణయాలతో ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్న ఎమ్మెల్యే.. ఈ సారి ఏకంగా దళిత బాణానికే టార్గెట్‌గా మారారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కోవలసిన దుస్థితిలో పడ్డారు.తమను కులం పేరుతో దూషించారన్న ఆరోపణతో సొంత పార్టీలోని పలువురు దళిత నేతలు నిప్పులు కక్కుతున్నారు. కేసు పెట్టడమే కాకుండా.. పార్టీ నాయకత్వానికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. వాసుపల్లికి వ్యతిరేకంగా మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో భారీ సభకూ సిద్ధమవుతున్నారు.ఎన్నికలు ఏడాది దూరంలోనే ఉన్న సమయంలో తలెత్తిన ఈ తిరుగుబాటు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే ఇప్పుడు రాజీ మంత్రం జపిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై ఆ పార్టీ దళిత నేతల తిరుగుబాటు దుమారం రేపుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తిరుగుబాటు చేసిన నేతలను దారికి తెచ్చుకునేందుకు ఒక్కొక్కరికి రెండేసి హుద్‌హుద్‌ ఇళ్లతో పాటు రూ.30 వేల నగదు ఇస్తామని ఎర వేస్తున్నారు. దారికొచ్చిన వారితో స్టాంప్‌ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అయితే వాసుపల్లి ఆగడాలతో విసిగివేసారిన పార్టీ సీనియర్‌ నేత రామారెడ్డితో సహా దళిత నేతలు మాత్రం రాజీకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఆయన తీరు వల్లే 23వ వార్డు సీనియర్‌ దళిత నేత సాలిగ్రామం కనకరాజు మనోవేదనతో మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ఫిర్యాదులు
పార్టీలో మంత్రి గంటా తర్వాత నగర పార్టీలో ఇన్నాళ్లు చక్రం తిప్పిన వాసుపల్లికి సొంత పార్టీలోనే సెగ మొదలైంది. ప్రత్యేక హోదా ఉద్యమంతో పార్టీ గ్రాఫ్‌ ఒకవైపు పడిపోతుంటే.. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో తలెత్తిన తిరుగుబాటు వాసుపల్లితోపాటు పార్టీకీ తలనొప్పిగా మారింది. 23వ వార్డు అధ్యక్షుడి మార్పు విషయంలో ఎదురు తిరిగిన పార్టీ నేతలను దారికి తెచ్చుకునేందుకు వాసుపల్లి నానాతంటాలు పడుతున్నారు. కులం పేరుతో దూషించారంటూ పార్టీ సీనియర్‌ నేత, కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్టీ ఓదూరి శివయ్య, అర్బన్‌ జిల్లా ఎస్సీ సెల్‌ జనరల్‌ సెక్రటరీ రేజేటి చిట్టిబాబు, ఎమ్మార్పీఎస్‌ అర్బన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తొత్తరమూడి శ్రీనివాస్‌లు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడులతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి  చినరాజప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకట్రావు, సీఎం చంద్రబాబుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు.

ప్రచార పోరాటం
ఫిర్యాదులతో ఆగకుండా దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వాసుపల్లి అవినీతి, భూకబ్జాలు, దళితులపై దౌర్జన్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. అప్పటికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే పార్టీలోని దళిత నేతలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని భావిస్తున్నారు. బుధవారం నగరానికి వచ్చిన ఎమ్మార్పీఎస్‌ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి మల్లవరపు నాగయ్య మాదిగ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దళితులను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే సాగించిన దాడులు, దౌర్జన్యాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా వచ్చే నెల రెండో తేదీన నగరానికి వస్తున్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయనతో నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నట్టు తొత్తరమూడి శ్రీనివాస్‌ వెల్లడించారు.

ఎదురు ఫిర్యాదు
వాసుపల్లిపై నమోదైన కేసు విచారణలో భాగంగా త్రీటౌన్‌ సీఐ ఇమ్మా నియేలురాజు బు«ధవారం టీడీపీ కార్యాలయం, సంఘటన జరిగిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. ఫిర్యాదు చేసిన వారితో పాటు ఆ సమయంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరించారు  ఇదిలా ఉంటే ఎమ్మెల్యేతో విబేధించిన పార్టీ సీనియర్‌ నేత రామారెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన తనను కులం పేరుతో దూషించారంటూ ప్రస్తుత వార్డు అధ్యక్షుడు బంగారు రవిశంకర్‌ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరినట్టయ్యింది.

‘కనకరాజు మృతికి ఎమ్మెల్యే వైఖరే కారణం’
ఎమ్మెల్యే వైఖరి కారణంగానే 23వ వార్డు దళిత నేత సాలిగ్రామం కనకరాజు చనిపోయాడని దళిత నేతలు ఆరోపిస్తున్నారు. చెంగలరావు పేట హైస్కూల్‌ పక్కనే సీట్‌ కవర్లు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న కనకరాజు బడ్డీని తన ఫ్లెక్సీకి అడ్డు వచ్చిందన్న అక్కసుతో ఎమ్మెల్యే బలవంతంగా తీయించేశారని.. తన పొట్టమీద కొడతారా? అని ప్రశ్నించిన పాపానికి ఎమ్మెల్యే ఆయన్ను నానాదుర్భాషలాడారని ఆరోపించారు. దాంతో తీవ్ర మనోవేదనతో కనకరాజు మృతి చెందాడని వివరించారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కుమార్తె పెళ్లికి ఆర్థిక సాయం చేస్తానని, అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారని.. అయితే కనీసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి గానీ, చివరకు చంద్రన్న బీమా నుంచి కానీ ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయలేదని వారు వివరించారు. ఇంతకంటే దళితుల పట్ల వాసుపల్లి వివక్ష మరొకటి ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు