‘రాఫెల్‌’.. భారీ కుంభకోణం: ఉత్తమ్‌

26 Jul, 2018 02:31 IST|Sakshi
బుధవారం మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో కుంతియా, వీహెచ్‌

     యుద్ధవిమానాల ధర రహస్యంగా ఉంచడం దేశ చరిత్రలో లేదు 

     దేశ భద్రతపై కేంద్రం రాజీ పడింది 

సాక్షి,హైదరాబాద్‌: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో కేంద్రంలోని పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, దేశ భద్రత విషయంలో రాజీ పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. యుద్ధవిమాన పైలట్‌గా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాల కొనుగోలు ధరను రహస్యంగా ఉంచడం దేశ చరిత్రలో లేదని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా, కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క, మాజీఎంపీ వీహెచ్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిలతో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ధర రహస్యమ ని ప్రధాని, రక్షణమంత్రులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. యుద్ధవిమానాలను ఉపయోగించే తీరు, శక్తిసామర్థ్యాలను రహస్యంగా ఉంచుతారని చెప్పారు. తాను కూడా మిగ్‌–21, మిగ్‌–23 విమానాలను నడిపానని, గతంలో ప్రభుత్వాలు జాగ్వార్, మిరాజ్‌ లాంటి యుద్ధవిమానాలను కొనుగోలు చేసినప్పుడు కూడా పార్లమెంటులో వాటి ధరలను చెప్పాయని గుర్తు చేశారు. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధనౌకను 2,330 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టు 2010 మార్చి 15న లోక్‌సభలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని చెప్పారన్నారు.  

ఫ్రాన్స్‌ కంపెనీ నివేదికలో ధర వెల్లడి 
రాఫెల్‌ యుద్ధవిమానాలను సమకూర్చిన ఫ్రాన్స్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌తో యూపీఏ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.526 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుందని, అయితే, బీజేపీ ప్రభుత్వం దాన్ని మూడింతలు చేసి ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లు పెట్టి 36 విమానాలు కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ ధరలను కేంద్రం వెల్లడించకపోయినా, డసాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ 2016లో ఇచ్చిన తన వార్షిక నివేదికలో చెప్పిందన్నారు. ఏవియేషన్‌ కంపెనీ తన నివేదికలో ధరలను బహిర్గతం చేసినప్పుడు కేంద్రం ఎందుకు దాచిపెడుతుందో అర్థం కావడం లేదన్నారు. అసలు ఈ ధరను నిర్ణయించేందుకు గాను సంప్రదింపుల కమిటీని వేయలేదని, రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు లోక్‌సభలో ప్రధాని చెప్పే నాటికి భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ అనుమతి కూడా తీసుకోలేదని ఆరోపించారు. యుద్ధవిమానాల కొనుగోలు ధరలను అడ్డగోలుగా పెంచడంతోపాటు వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే కాంట్రాక్టును అనిల్‌అంబానీకి చెందిన ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారన్నా రు. రక్షణ సామగ్రిని తయారు చేసిన చరిత్ర లేని ప్రైవేటు కంపెనీకి 36 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కుంతియా మాట్లాడుతూ రాఫెల్‌ కుంభకోణానికి, అమిత్‌షా కుమారుడి ఆస్తులు పెరగడానికి సంబంధం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.   

ప్రభుత్వ వైఫల్యాలపై నివేదికలివ్వండి 
ఏఐసీసీ కార్యదర్శుల ఆదేశాలు 
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ కార్యదర్శులు ఆదేశించారు. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రభుత్వ పథకాల అమలు, రాజకీయ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గాలపై నిర్వహించిన సమీక్షలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి ఎన్‌.బోసురాజులు పాల్గొని మాట్లాడారు. 

మరిన్ని వార్తలు