పితానీ.. ఇదేం పని! 

17 Jul, 2020 04:10 IST|Sakshi

ఈఎస్‌ఐ మందులు నాసిరకం అని తేల్చినా చర్యలు తీసుకోలేదు 

పారాసెటిమాల్‌ పనికిరానివని ఔషధ నియంత్రణ శాఖ నివేదిక 

ఏజెన్సీ మీద ప్రేమతో ఆ ఫైళ్లనే చెత్తబుట్టలో వేశారు 

రేటు కాంట్రాక్టులో లేని సంస్థల నుంచి భారీగా కొనుగోళ్లు 

పితాని కుమారుడు స్లిప్పులు రాసి.. ఫోన్‌లు చేసేవారని అధికారుల వెల్లడి 

సాక్షి, అమరావతి : ఈఎస్‌ఐ (ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌)లో కార్మికుల కడుపు కొట్టి రూ.కోట్లు కొట్టేసిన అప్పటి నేతలు, అధికారుల అవినీతి ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. నాణ్యతను గాలికొదిలేసి, ఏజెన్సీల నుంచి వచ్చే కమీషన్ల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టిన తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలోని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో జరిగిన అవినీతి తాజాగా బయటికొచ్చింది. ఒక ఏజెన్సీ కోసం ఏకంగా ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికనే తొక్కిపెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. మరోవైపు ఆయన కుమారుడు వెంకట సురేష్‌ స్లిప్పులు రాసిచ్చి నామినేషన్‌ కింద ఆర్డర్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. 

ఔషధ నియంత్రణ శాఖ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు 
2019 ఫిబ్రవరిలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన పారాసెటిమాల్‌ మాత్రలు డొల్ల అని, సరఫరా చేసిన ఏజెన్సీని రద్దుచేయండని ఔషధ నియంత్రణ శాఖ నివేదిక ఇచ్చింది.  
ఆ నివేదికను మంత్రి పితాని ఒత్తిడి మేరకు చెత్తబుట్టలో వేశారు. ఏజెన్సీపై కనీస చర్యలూ తీసుకోలేదు. 

ఏజెన్సీతో ఉన్న లావాదేవీలే కారణం 
2016లో తయారైన ఈ మందులు 2019 ఆగస్ట్‌తో ఎక్స్‌పెయిరీ అవుతాయన్న ఉద్దేశంతో ఆదరాబాదరాగా సరఫరా చేశారు. 
ఈ మందులను తిరుమల మెడికల్‌ ఏజెన్సీస్‌ సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీ అధినేత కార్తీక్‌ జైల్లో ఉన్నారు. 
2019 ఫిబ్రవరిలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందులు నాసిరకమైనవని తిరుపతి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నివేదిక ఇచ్చారు. 
 ఈ నివేదికను జేడీ జగదీప్‌ గాంధీ.. అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు పంపి చర్యలు తీసుకోమన్నారు. అప్పటి మంత్రి పితాని ఒత్తిళ్ల మేరకు డైరెక్టర్‌ చర్యలు తీసుకోలేదు. 
తిరుమల ఏజెన్సీస్‌ విజయవాడలోని  భవానీపురంలో ఓ అపార్ట్‌మెంట్‌ చిరునామా ఇచ్చారు. 
పోలీసుల విచారణలో ఆ చిరునామాలో ఇలాంటి ఏజెన్సీనే లేదని తేలింది. 
మాత్రలు నాసిరకం అని తేలిన మరుసటి రోజునే ఆ చిరునామా ఇంటికి నోటీసు అతికించగా.. ఎవరూ స్పందించలేదు. 
 సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకపోవడంతో మంత్రి స్వయానా ఏజెన్సీని కాపాడేందుకు యత్నించినట్టు తెలుస్తోంది.  

స్లిప్పులు రాసి పంపించేవారు
మంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్‌ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా నొక్కేశారు.  
రేటు కాంట్రాక్టులో లేని ఏజెన్సీల నుంచి కొనుగోళ్లు చేయడమే కాదు, ఎక్కువ రేటుకు తీసుకోవాలని సిఫార్సు చేసేవారు. మంత్రి కొడుకు చేసిన ఈ వ్యవహారాలను ఈఎస్‌ఐ అధికారులు కొంతమంది ఏకరువు పెట్టారు. వాళ్లు ఏమంటున్నారంటే.. 
మంత్రి కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారు. వాటి ఆధారంగా ఇచ్చాం. స్లిప్పు రాసిచ్చాక మళ్లీ ఫోన్లు చేసేవారు. స్లిప్పులను తర్వాత చించేసేవాళ్లం. 
 మంత్రి కొడుకు సిఫార్సు చేసిన వాటిలో రేటు కాంట్రాక్టులో లేని సంస్థలే ఉన్నాయి. 
 బిల్లుల చెల్లింపుల్లోనూ స్లిప్పులు రాసి పంపించేవారు. 

మరిన్ని వార్తలు