స్పష్టంగా నోట్ల రద్దు గాయాలు

9 Nov, 2018 03:30 IST|Sakshi
మన్మోహన్‌సింగ్‌

మన్మోహన్‌ సింగ్‌ విమర్శ

రద్దును ప్రణాళికాయుత నేరపూరిత కుంభకోణంగా అభివర్ణించిన రాహుల్‌

న్యూఢిల్లీ: సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దుష్ప్రభావాలు కాలం గడిచేకొద్దీ స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. పెద్దనోట్ల రద్దును అనాలోచిత నిర్ణయంగా అభివర్ణించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్‌ మాట్లాడుతూ.. ‘కాలం అన్నిరకాల గాయాలను మాన్పుతుంది. కానీ దురదృష్టవశాత్తూ పెద్దనోట్ల రద్దు చేసిన గాయాలు, మచ్చలు కాలం గడిచేకొద్దీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) పడిపోయి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చిన్నాభిన్నమయ్యాయి. వయసు, కులం, మతం, ప్రాంతం, వృత్తి అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఉద్యోగాలు పడిపోయాయి. నోట్ల రద్దు దుష్ప్రభావాలను ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదల, రూపాయి  విలువ క్షీణత నేపథ్యంలో స్వల్పకాలిక ప్రయోజనాల కోసం అశాస్త్రీయ, తాత్కాలిక లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినందుకు మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని పేర్కొన్నారు. 2016, నవంబర్‌ 8న మోదీ పెద్దనోట్లను రద్దుచేశారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా నేడు జాతీయ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

సూటుబూటు స్నేహితుల కోసమే: రాహుల్‌
తన సూటుబూటు స్నేహితుల నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకునేందుకు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు అనే తీవ్రమైన కుట్ర పన్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా సమర్థిస్తే దేశప్రజల విజ్ఞత, జ్ఞానానికే అవమానమని వ్యాఖ్యానించారు. నోట్లరద్దు లక్షలాది మంది ప్రజల జీవితాన్ని నాశనం చేసిందన్నారు. నోట్లరద్దును పక్కా ప్రణాళికతో చేసిన నేరపూరిత ఆర్థిక కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. కాగా ఇది పక్కా దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధికారిక మనీలాండరింగ్‌ పథకమని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు.

దేశచరిత్రలోనే చీకటిరోజు: మమతా
పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత చరిత్రలోనే చీకటి రోజని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నోట్ల రద్దు వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా వ్యవసాయంతో పాటు చిరు వ్యాపారులు, కార్మికులు, రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒంటిచేత్తో నాశనం చేశారు: ఏచూరి
మోదీ, ఆయన అనుచరులు పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని నిర్మూలిస్తుందని, అవినీతి, ఉగ్రవాదాన్ని రూపుమాపుతుందని నమ్మారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఇకపై డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు మాత్రమే జరుగుతాయని వారు భావించారన్నారు. కానీ నిజమేంటంటే.. మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒంటిచేత్తో నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు