మళ్లీ వస్తే ఎవరినీ బతకనివ్వరు

25 Oct, 2018 05:38 IST|Sakshi
విద్యాసంస్థల జేఏసీ ‘వీ టూ’ కార్యక్రమంలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. చిత్రంలో చాడ, రమణారెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, ఎల్‌.రమణ తదితరులు

టీఆర్‌ఎస్‌పై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఫైర్‌

నలుగురి కబంధ హస్తాల్లో 4 కోట్ల మంది విలవిల

ముదనష్టపు ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి

45 రోజులు కష్టపడితే చాలు.. నియంతృత్వ పాలన అంతం

కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ ‘వీ టూ’కార్యక్రమంలో ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: నలుగురు సభ్యులున్న కుటుం బం 4 కోట్ల తెలంగాణ ప్రజలను హింసిస్తోందని, ఆ నలుగురి కబంధ హస్తాల్లో పడి ప్రజలు విలవిల్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపే లక్ష్యం తో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ‘వీ టూ’కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. అత్యంత అవినీతి, నియంతృత్వ సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఈ ముదనష్టపు ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, లేకపోతే ఎవరినీ బతకనివ్వరన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే డబ్బు, మద్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

విద్యాసంస్థలపై కుట్రలా..?
ప్రైవేటు సంస్థలు భయపడొద్దని, విద్యాసంస్థలను బెదిరిస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. సేవ చేయాలని ముందుకొచ్చిన విద్యా సంస్థలకు మేలు చేయకపోగా, మూసివేసేలా అణచివేత చర్య లు చేపట్టారన్నారు. విద్యా సంస్థలు పౌల్ట్రీ షెడ్డుల్లో నడుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా నిరాధార ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ అవమానించారని గుర్తు చేశారు. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా విద్యా సంస్థలను మూసేసేలా చేశారని మండిపడ్డారు.   

ఆంక్షలు లేకుండా ఫీజులు
డిసెంబర్‌ 12న మహాకూటమి ప్రమాణ స్వీకారం చేస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంక్షలు లేకుండా 100% ఫీజు ఇస్తామన్నారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లోని 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందికి రూ.5 లక్షల విలువైన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కల్పిస్తామన్నారు. సిబ్బందికి వసతిగృహం కోసం హౌజింగ్‌ స్కీంను ప్రవేశ పెడతామన్నారు. ఎలక్ట్రిసిటీ చార్జీలను కమర్షియల్‌ నుంచి డొమెస్టిక్‌కు తగ్గిస్తామని చెప్పారు. మున్సిపల్, ఆస్తి పన్నులను కమర్షియల్‌ నుంచి రెసిడెన్స్‌ కేటగిరీకి మార్చుతామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని, అంతా సీఎం కనుసన్నల్లోనే ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకోసారి సమావేశం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు ఉండబోవని చెప్పారు. 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ఉద్ఘాటించారు. ఫీజు, మెస్‌ చార్జీలను పెంచి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫీజు రూ.1,700 అంటే అది విద్యా వ్యవస్థను అవమానపరచడమేనన్నారు. అందరూ మరో 45 రోజులు కష్టబడి పనిచేస్తే నియంత పాలన అంతమవుతుందన్నారు.

రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ కేసీఆర్‌లోనే
స్వపరిపాలన అంటే కేసీఆర్‌ కుటుంబ పాలన అయిపోయిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయని విమర్శించారు. ఆయన వల్ల నాలుగేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు చీడ పురుగులా తయారయ్యారని మండిపడ్డారు. అందుకే ఆయనను గద్దె దింపేందుకు మహాకూటమి ఏర్పాటైందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. అలాంటి పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని కోరారు. తెలంగాణ ప్రజలు చదువుకుంటే ఓట్లు వేయరని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందుకే ఫీజులపై ఆంక్షలు పెట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు.

తమ పిల్లలను చదివించుకోవాలని తల్లిదండ్రులు అనుకుం టే.. కేసీఆర్‌ మాత్రం పిల్లలు బర్లకాడికి, గొర్లకాడికి, పందుల కాడికి, చేపల కాడికి పోవాలన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి పాలన మళ్లీ రాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్‌ కాలేజీలు ప్రభుత్వ విధానాల వల్ల కనుమరుగయ్యాయని జేఏసీ చైర్మన్‌ జి.రమణారెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మహా కూటమిని గెలిపించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ గౌరి సతీశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు