లష్కర్ బరి.. ఉద్దండుల గురి..!

15 Mar, 2019 12:20 IST|Sakshi

నాడు హస్తం, నేడు కమలం, రేపు గెలుపెవరిదో!!  

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో పాగా వేసేదెవరో    

పన్నెండు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం  

నాలుగు పర్యాయాలు వికసించిన కమలం  

మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య జయకేతనం

దత్తాత్రేయ, శివశంకర్‌లకు కేంద్ర మంత్రులుగా అవకాశం

ఆధునికతకు, హైదరాబాద్‌ విలక్షణ సంస్కృతీ సంప్రదాయాలకు  అద్దం పట్టే లష్కర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం. రాజకీయంగానూ ఎంతగానో ప్రసిద్ధి గాంచింది.  ఒకప్పటి బ్రిటిష్‌ పాలన.. మరోవైపు నవాబుల పాలన ఆనవాళ్లకలబోతగా అలరారుతున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గతంలో ఉద్దండులైన రాజకీయ నాయకులు ఎంపీలుగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన గరీబోళ్ల బిడ్డ.. కార్మిక నేత టంగుటూరి అంజయ్య ఇక్కడి నుంచి 1984–87 మధ్యకాలంలో ఎంపీగా గెలుపొంది సేవలందించారు. అంజయ్య మరణానంతరం ఆయన సతీమణి మణెమ్మ సైతం 1987–89లో, తిరిగి 1989–91 మధ్యకాలంలో ఎంపీగాగెలుపొంది ఈ నియోజకవర్గంపై చెరగని ముద్రవేశారు. ఇక మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరరావు సైతం ఈ నియోజకవర్గం నుంచి 1996–98 మధ్యకాలంలో ఎంపీగా గెలుపొందడం విశేషం. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ సైతం ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. 1979–80, 1980–84 మధ్య కాలంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.శివశంకర్‌ సైతం ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి పాగా వేసేందుకు అన్ని పార్టీలూ పావులు కదుపుతున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో మొత్తంగా 19,54,813 మంది ఓటర్లున్నారు. వీరిలో 10,18,912 మంది పురుషులు. 9,35,844 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 57 మంది ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు బీజేపీ నుంచి మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా అంజన్‌కుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి రంగంలోకి ఎవరు దిగుతారనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది.

ఎక్కువసార్లు కాంగ్రెస్సే..
సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి 1957 నుంచి 2018 వరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే పన్నెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. నాలుగు పర్యాయాలు బీజేపీ ఈ నియోజకవర్గంలో పాగా వేసింది. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి నరాల సాయికిరణ్‌ ముదిరాజ్‌ 1971–77 మధ్యకాలంలో ఎంపీగా గెలుపొందారు. ఆయన కూడా అంతకుముందు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందినవారే కావడం విశేషం.

మరిన్ని వార్తలు