ఒక్క చాన్సూ దక్కలేదు!

18 Mar, 2019 09:26 IST|Sakshi

ఏ పార్టీ టికెట్లు ఇవ్వలేదు 

తప్పని నాయకుల దిగుమతి

ఆది నుంచీ స్థానికేతరులే..

ఇదీ ‘సికింద్రాబాద్‌’ ప్రత్యేకత

సికింద్రాబాద్‌: రాష్ట్రంలోనే సికింద్రాబాద్‌ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. వీటికి ఇప్పటివరకు ముప్పైరెండు సార్లు ఎన్నికలు జరగాయి. కానీ ప్రధాన పార్టీలు ఇక్కడినుంచి స్థానికులకు టికెట్లు ఇవ్వకపోవడంతో స్థానికులెవరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోయారు. ఆదినుంచీ ఇక్కడ స్థానికేతరులదే హవా నడుస్తోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లో దిగుమతి నాయకులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు.  

32 ఎన్నికల్లోనూ..
సికింద్రాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఇప్పటివరకు 15, లోక్‌సభకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా జరిగిన 32 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఏ ఒక్క నాయకుడికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ పోటీ చేసే అవకాశమే ఇవ్వలేదు. సికింద్రాబాద్‌ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చుట్టు పక్కల నియోజకవర్గాల నాయకులు పోటీ చేయడం, పదవీకాలం తర్వాత వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది.   

సనత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేలు..
సికింద్రాబాద్‌ నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇందులో ఇద్దరు మినహా ఆరుగురు నేతలు సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోనివారే. కేఎస్‌ నారాయణ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, టి.పద్మారావుగౌడ్‌లు తలా మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ ముగ్గురు సనత్‌నగర్‌ నియోజకవర్గానికి చెందినవారే. 1972, 78 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎల్‌.నారాయణతో పాటు అల్లాడి రాజ్‌కుమార్, మేరీ రవీంద్రనాథ్‌లు కూడా సనత్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన వారే. గచ్చిబౌలి వాస్తవ్యురాలు, ప్రముఖ సినీనటి జయసుధ, వరంగల్‌కు చెందిన మేచినేని కిషన్‌రావులను కూడా లష్కర్‌ ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేలుగా పని చేసే అవకాశమిచ్చారు.  

హైదరాబాద్‌ నుంచి ఎంపీలు..  
సికింద్రాబాద్‌ ఎంపీలు గెలిచిన బండారు దత్తాత్రేయ, బాఖర్‌ అలీ మీర్జా, ఎంఎం హషీం, అంజన్‌కుమార్‌ యాదవ్‌లు హైదరాబాదీలు. ఇందులో కొందరు పాతబస్తీకి చెందిన వారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌ నుంచి పి.శివశంకర్, బర్కత్‌పుర నుంచి టి.అంజయ్య, మణెమ్మ, ఆదర్శ్‌నగర్‌ నుంచి పీవీ రాజేశ్వర్‌రావు సికింద్రాబాద్‌ ఎంపీలుగా గెలుపొందారు.  

దిగుమతి నాయకులే దిక్కు..
సికింద్రాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించే నాయకుల జాబితా క్రమేణా తగ్గుతూ వస్తోంది.  ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. ఏ పార్టీ ఏ నాయకుడిని దిగుమతి చేస్తుందా అంటూ ఈ ప్రాంత ఓటర్లు ఎదురుచూడడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ఇదే వైనం పునరావృతం కానుంది. ఇక్కడి నుంచి ఎంపీ టికెట్‌ ఆశించే నాయకులు ఎవరూ లేరు. ఫలితంగా సికింద్రాబాద్‌ అభ్యర్థిగా ఏ పార్టీ.. ఏ నాయకుడిని దిగుమతి చేస్తుందా అని ఓటర్లు ఎదురుచూస్తున్నారు. 

మరిన్ని వార్తలు