చంద్రబాబు చివరి షో!

15 May, 2019 04:51 IST|Sakshi

ఆయనకు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం

బాబు మళ్లీ సచివాలయానికి రాకపోవచ్చంటూ అంతటా సెటైర్లు

మంత్రులు, అనుచరులు, సిబ్బందిలో నైరాశ్యం 

ఫలితాల తరువాత పరిస్థితి ఏమిటనే ఆందోళన

సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషన్‌తో ఘర్షణకు దిగి, ఉన్నతాధికారులను బెదిరిస్తూ పంతం కోసం సీఎం చంద్రబాబు మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశమే ఆయనకు చివరిదని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ భేటీకి హాజరైన మంత్రుల ముఖాల్లో కళాకాంతులు లేకపోగా మళ్లీ ఈ సచివాలయానికి మంత్రిగా వస్తామో లేదో, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే రీతిలో నర్మగర్భంగా మాట్లాడడం విశేషం. కొందరు మంత్రులు గెలుపుపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శించగా మరికొందరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు బహిరంగంగానే అంగీకరించారు. ఇక సమావేశానికి మంత్రుల వెంట వచ్చిన వారి అనుచరులు, సిబ్బందిలో ఏమాత్రం ఉత్సాహం కానరాలేదు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని వారంతా చర్చించుకోవడం కనిపించింది.  

మౌనంగా వెళ్లిపోయిన మంత్రులు..
సాధారణంగా మంత్రివర్గ సమావేశాలు జరిగినప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చే మంత్రులు కొందరు ఈసారి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిష్క్రమించారు. వారి భద్రతా సిబ్బంది సైతం ఏం జరుగుతుందోనని చర్చించుకోవడం కనిపించింది. కొందరు మంత్రులు మాత్రం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ మీ అంచనా ఏమిటి? టీడీపీ గెలిచే అవకాశాలున్నాయా? పసుపు – కుంకుమ ప్రభావం పనిచేసిందా? అని ఆరా తీశారు. ఇదే ఆఖరు మంత్రివర్గ సమావేశమని, ఫలితాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని  వ్యాఖ్యానించారు. 

చంద్రబాబును కలిసిన డీఎంకే నేత
తమిళనాడుకు చెందిన డీఎంకే సీనియర్‌ నాయకుడు దొరై మురుగన్‌ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అరగంటపాటు సమావేశమైన వీరిద్దరూ తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. డీఎంకే అధినేత స్టాలిన్‌ ప్రతినిధిగా మురుగన్‌ చంద్రబాబును కలిశారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 

నా ప్రత్యర్థి బలవంతుడు: నారాయణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ మీడియాతో ముచ్చటిస్తూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నానని, ఏం జరుగుతుందో చూద్దామంటూ నైరాశ్యం వ్యక్తం చేశారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. అధికారులు, ఉద్యోగులంతా చంద్రబాబుకి ఇదే ఆఖరి మంత్రివర్గ సమావేశమని, ఆయన మళ్లీ సచివాలయానికి వచ్చి సమావేశం నిర్వహించే అవకాశం రాకపోవచ్చని సెటైర్లు వేసుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రులతో వచ్చిన పార్టీ నాయకులు, అనుయాయులు సైతం తమ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు