ఈటెల్లాంటి మాటలతో రగడ

26 Dec, 2017 07:48 IST|Sakshi

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే దూకుడు

ఆయన వల్లే ఘర్షణలని కాంగ్రెస్‌ విమర్శలు

సాక్షి, బెంగళూరు: ఆయన ఎంపీ,  కేంద్ర మంత్రి కూడా. అయితే ఆయన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఆయనే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే. తనదైన శైలి వ్యాఖ్యలతో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడుతూ చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఆదివారం రోజున కొప్పళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంత్‌కుమార్‌ హెగ్డే....‘కొంత మంది తాము లౌకికవాదులమని చెప్పుకుంటూ ఉంటారు. తమ రక్తం గురించి, తమ తల్లిదండ్రులెవరో తెలియని వారు మాత్రమే ఇలా చెప్పుకుంటారు. హిందుత్వానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఎవరో ఒకరిద్దరు వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి మాట్లాడినంత మాత్రాన మేం మారబోము. ప్రస్తుతం రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగాన్ని మార్చేందుకే మేం వచ్చాం’ అంటూ వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి హెగ్డేకి మతి తప్పింది: దినేష్‌ గుండూరావ్‌
సాక్షి, బెంగళూరు: ‘కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డేకు మతిస్థిమితం తప్పింది. అధికారం తలకెక్కింది. అందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌ గుండూరావ్‌ మండిపడ్డారు. సోమవారం కేపీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హెగ్డే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు రాజ్యాంగాన్ని కాపాడతానని, రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకుంటానని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రమాణానికే విలువ ఇవ్వడం లేదని విమర్శించారు.

సీఎం విచారణకు అనుమతించరాదు
భూపసంద్ర డీనోటిఫికేషన్‌ అంశానికి సంబంధించి సీఎంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని కోరారు. ఎమ్మెల్సీ ఉగ్రప్ప మాట్లాడుతూ మంత్రి హెగ్డే వల్లే కరావళిలో కులఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు