ప్రధాని ఎంపిక మన చేతుల్లో: చంద్రబాబు

22 Apr, 2018 12:33 IST|Sakshi
ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి: రాబోయే రోజుల్లో ప్రధాని ఎంపిక మన చేతుల్లో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒక నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటే మోదీ మన మాట వినేవారని ఆయన చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన సాధికార మిత్రలతో సమావేశం నిర్వహించారు. అదే సమయంలో వివిధ జిల్లాల్లోని వారితో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసాలపై ఈ నెల 30న తిరుపతిలో నిర్వహించే సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శిస్తామన్నారు. అక్కడ రాష్ట్రానికిచ్చిన హామీలపై తిరుమల వెంకన్న స్వామికే సమాధానం చెప్పాలని మోదీని అడుగుతానని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఓటు రాదు.. ఒక సీటు రాదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రభుత్వ పెద్దలు చాలా అహంభావంతో ఉన్నారని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే విరుచుకుపడుతున్నారని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వస్తే మనకు న్యాయం జరుగుతుందని మద్దతు ఇచ్చానన్నారు.

నాతో పెట్టుకోవాలంటే ధైర్యం ఉండాలి
మోదీ కంటే సీనియర్‌నని, కనీసం మిత్రధర్మం పాటించలేదని సీఎం ఆరోపించారు.  నాతో గొడవ పెట్టుకోవాలంటే ధైర్యం ఉండాలి కదా అని అన్నారు.  కేంద్రం సహకరించడంలేదని రాష్ట్రాభివృద్ది విషయంలో రాజీపడి ఇంట్లో పడుకోనని.. కేంద్రానికి మన తడాఖా చూపించి వడ్డీతో సహా మన రాష్ట్రానికి రావాల్సినవి రప్పిస్తానన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో బంద్‌లకు పిలుపునివ్వడం ద్వారా రాష్ట్రానికి నష్టాన్ని చేకూర్చవద్దని చంద్రబాబు కోరారు. ఎస్సీ, ఎస్టీ కేసులో సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.  

ఆడపిల్లలు తగ్గిపోవడానికి ప్రజల ఆలోచనే కారణం
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి ప్రజల ఆలోచనా విధానాలే కారణమని.. ఈ ధోరణి మారాలని ముఖ్యమంత్రి అన్నారు. మగపిల్లలు, ఆడపిల్లలు సమానం అనే భావన వ్యవస్థలోకి గట్టిగా తీసుకువెళ్లాలని, ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు