చంద్రబాబే చెప్పారు.. చెరి సగం పంచుకోమని..

23 Feb, 2018 02:13 IST|Sakshi

అవినీతి వాటాల పంపిణీకి సీఎం పచ్చజెండా

సంచలనం రేపుతున్న మంత్రి ఆది వీడియో

ఇద్దరు ఐఏఎస్‌ల సమక్షంలో చంద్రబాబు పంచాయితీ!

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:  రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అవినీతి వైరస్‌లా ఊరూరా విస్తరించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీఎంగా  పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే అవినీతిని కేంద్రీకృతం చేసి అక్రమాలకు ద్వారాలు బార్లా తెరిచారు. తాను రారాజు అయినట్లు, మంత్రులు, పార్టీ నేతలు సామంతులైనట్లు... భారీగా కొల్లగొడుతూ పార్టీ మంత్రులు, ముఖ్య నాయకులు, శ్రేణులను కూడా పంచుకుతినండంటూ అనుమతులు ఇచ్చేశారు.

ముఖ్యమంత్రి తన ముఖ్య కోటరీతో పాటు అత్యంత నమ్మకమైన ఉన్నతాధికారుల సహకారంతో భారీ డీల్స్‌ ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లకు పైగా ఆర్జించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.ఇవన్నీ నిజమేనని మంత్రి ఆదినారాయణరెడ్డి మాటలతో స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ తరఫున జమ్మలమడుగు నుంచి పోటీచేసి గెలుపొంది, పార్టీ ఫిరాయించి టీడీపీ కండువా కప్పుకుని, రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వ అవినీతి విశ్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

‘‘రామసుబ్బారెడ్డి గారికి కూడా ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి భాగం ఉంది ఈడ. అర్థ రూపాయి భాగం ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు ఐఏఎస్‌ ఆఫీసర్లను మాతోపాటు కూర్చోబెట్టి పంచాయతీ చేశారు.ఆయన అడిగిన దాంట్లో మనకు సగం వస్తాది. మనం అడిగిన దాంట్లో ఆయనకు సగం వస్తాది. వాళ్లు నన్ను ఏమి విమర్శించినా నేను అయితే పట్టించుకోను’’అంటూ ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.

గండికోట పునరావాస కాలనీల టెండర్లు దక్కించుకోవడంలోనూ వీళ్లిద్దరూ ఏకమయ్యారు. అయితే అదే పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్‌ టెండర్లు తెరవకుండా అడ్డుకున్నారని ఆగ్రహించిన మంత్రి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ స్థానిక కార్యాలయంపై దాడి చేయడం గమనార్హం. ఒకే పార్టీకి చెందిన నేతలు కాంట్రాక్టులకోసం బరితెగించడం, వారి మధ్య పంపకాలు జరిపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడాన్ని బట్టి ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


అవినీతి సొమ్ముతో కొనుగోళ్లు
ప్రాజెక్టు పనుల అంచనాలను ఆకాశానికంటేలా పెంచి, తద్వారా అందుకున్న వాటాల సొమ్ముతోనే చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారని విమర్శలున్నాయి. ఇలా అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో చంద్రబాబు 23మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఏకంగా రూ.30 కోట్ల వరకు నజరానాగా ముట్టచెప్పడంతోపాటు భారీగా కాంట్రాక్టులు అప్పజెప్పారని తెలుస్తోంది.

దీనిపై సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు వ్యతిరేకించడంతో... అందరికీ న్యాయం చేస్తానంటూ చంద్రబాబు నేరుగా పంచాయతీలు చేసినట్లు మంత్రి మాటలతో వెల్లడవుతోంది. అందులో ఐఏఎస్‌ అధికారులను కూడా భాగస్వాములను చేయడం బరితెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించడం గమనార్హం.  తాజాగా మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలు సైతం కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పనితీరుకు అద్దం పడుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన తొలి కలెక్టర్ల సమావేశంలోనే తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు సహకరించాల్సిందేనని విస్పష్టంగా చెప్పారు.

అంతేకాదు తన భారీ అవినీతి ప్రణాళికలకు అంగీకరించని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఢిల్లీ బాట పట్టించారు. అవినీతికి సహకరిస్తున్న అధికారులపై ఈగ కూడా వాలనీయడంలేదు. దోచుకున్న సొమ్మును ఫిïఫ్టీ.. ఫిïఫ్టీ వాటాలు పంచుకోండంటూ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఉండరని విశ్లేషకులు దుయ్యబడుతున్నారు. తాము అన్ని విషయాలపై నోరు విప్పితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని మిత్రపక్షం బీజేపీ నాయకులు అంటున్నారంటే ఆయన అవినీతి, అక్రమాలు వ్యవహారాలు ఏ రీతిలో ఉండి ఉంటాయో అంచనా వేసుకోవచ్చు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు