‘ఆప్‌’రేషన్‌ సప్తపది

12 Feb, 2020 02:14 IST|Sakshi

గ్యారంటీ కార్డులు

విద్యారంగంలో సంస్కరణలు

పాజిటివ్‌ ప్రచారం

గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ మోడల్‌ అభివృద్ధి

ఏకే, పీకే కాంబినేషన్‌

హిందూత్వపై సామరస్య ధోరణి

బీజేపీ, కాంగ్రెస్‌ ఫెయిల్యూర్‌ స్టోరీ 

గ్యారంటీ కార్డులు: అయిదేళ్లలో ఢిల్లీలో తాను చేపట్టిన అభివృద్ధిని చాటి చెబుతూనే సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్‌లో కొనసాగిస్తామంటూ కేజ్రీవాల్‌ ఎన్నికల మేనిఫెస్టోకి ముందే గ్యారంటీ కార్డుల్ని విడుదల చేశారు. ప్రజలకి మొత్తం 10 అంశాల్లో గ్యారంటీ ఇచ్చారు. నెలకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు, మహిళలు, విద్యార్థులకి బస్సుల్లో ఉచిత ప్రయాణం, సీనియర్‌ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రలు తదితర హామీలు సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి.

విద్యారంగంలో..  
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంచడానికి గత అయిదేళ్లుగా అనుమతినివ్వలేదు. గత మూడేళ్లుగా వార్షిక బడ్జెట్‌లో 25శాతానికిపైగా విద్యారంగంపైనే ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి టీచర్‌ ట్రైనింగ్‌ వరకు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పాఠశాలల్లో జరిగే ప్రతీ అంశంలోనూ పిల్లల తల్లిదండ్రుల్ని భాగస్వాముల్ని చేశారు.

పాజిటివ్‌ ప్రచారం: 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ విజయ దుందుభి మోగించాక జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావించారు. తాను ఏం చేస్తున్నానో పాజిటివ్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. కేజ్రివాల్‌ వంటి అరాచకవాదులు, ఉగ్రవాదులు దేశంలో దాక్కొని ఉంటారంటూ బీజేపీ ఎంపీ పర్వేష్‌ వంటి నాయకులు నోరు పారేసుకున్నా సంయమనం పాటించారు. ఆప్‌ గెలిస్తే తన ఆ«ధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా బీజేపీని మించిపోయి ఆప్‌ చేసిన ప్రచారమే హోరెత్తింది.

గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ మోడల్‌ అభివృద్ధి  
అభివృద్ధిలో మోదీ కంటే తాను ఒక అడుగు ముందే ఉన్నానని నిరూపించడానికి కేజ్రీవాల్‌ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని ఎలాగైతే ప్రచారం చేసిందో, అదే స్థాయిలో ఢిల్లీ మోడల్‌ అభివృద్ధిని ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రజారోగ్యం కోసం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌లలో ఉచిత చికిత్స, వైద్య పరీక్షలు, పారదర్శక పరిపాలన, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని తక్కువ సమయంలో, అంచనా వేసిన దానికంటే తక్కువ వ్యయంతో పూర్తి చేయడం వంటివాటితో ఢిల్లీ మోడల్‌ అభివృద్ధిని పాపులర్‌ చేశారు.

ఏకే, పీకే కాంబినేషన్‌  
అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఏకే), ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) వీరిద్దరి కాంబినేషన్‌ ఢిల్లీ ఎన్నికల దశను మార్చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆవిర్భవించాక ఇప్పటివరకు ఆరు ఎన్నికల్ని ఎదుర్కొంది. రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ, ఒక స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే మొట్టమొదటిసారిగా ప్రశాంత్‌ కిశోర్‌కి చెందిన ఐపాక్‌ ఏజెన్సీని ఎన్నికల వ్యూహకర్తగా ఆప్‌ నియమించుకుంది. గ్యారంటీ కార్డుల విడదుల , కేజ్రివాల్‌ స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడం, టౌన్‌హాల్స్‌లో సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమాలు పార్టీకి అత్యంత అనుకూలంగా మారాయి.

హిందూత్వపై సామరస్య ధోరణి  
 హిందూ ఓట్లను నష్టపోకూడదనుకున్న కేజ్రివాల్‌ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరిగిన నిరసనలపై ఆచితూచి వ్యవహరించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి తీర్థయాత్ర కార్యక్రమం కింద తొలి రైలుని ప్రారంభించారు. వైష్ణోదేవి ఆలయం, మథుర, రిషికేష్‌ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే సీనియర్‌ సిటిజ్లకు ఉచిత ప్రయాణం, వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. హనుమాన్‌ చాలీసా చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుందంటూ ఎన్నికలకు ముందు ఒక వీడియో విడుదల చేశారు. కేజ్రివాల్‌ హనుమాన్‌ చాలీసా చదువుతున్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలింగ్‌కు ఒక రోజు ముందు కుటుంబ సభ్యులతో కలిసి హనుమాన్‌ ఆలయంలో పూజలు చేశారు.

బీజేపీ, కాంగ్రెస్‌ ఫెయిల్యూర్‌ స్టోరీ  
కాంగ్రెస్‌ పార్టీ ముందే ఓటమి ఖాయమని తేలిపోవడంతో ప్రచారంపై దృష్టి సారించలేదు. బీజేపీ తొలి దశలో ఆప్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అదంతా డొల్లేనని ప్రచారం చేసింది. తర్వాత వ్యూహాన్ని మార్చుకొని జాతీయవాదాన్నే మళ్లీ ఎజెండాగా తీసుకుంది. స్థానిక సమస్యలకు బదులుగా పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్నS నిరసన ప్రదర్శనల్ని ప్రచారాస్త్రంగా చేసుకుంది. అయినా అవేవీ కేజ్రివాల్‌కి ఉన్న క్రేజ్‌ ముందు నిలబడలేకపోయాయి.

మరిన్ని వార్తలు