అసెంబ్లీని సమావేశపర్చండి

31 Jul, 2018 00:48 IST|Sakshi

విభజన హామీల అమలుపై చర్చకు..

షబ్బీర్‌ అలీ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాల ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ విష యంలో ప్రజలకు నిజాలు తెలియాలంటే శాసనసభ, మండలిని సమావేశపరిచి చర్చించాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

సోమవారంలో సీఎల్పీ కార్యాలయంలో శాసనసభాపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని వ్యాఖ్యానించారు.

విభజన హామీల అమలు గురించి సీఎంగా ఉండి కూడా కేసీఆర్‌ ప్రధాని మోదీ ముందు మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ఎంపీ కవిత ముందు సమర్థించి ఆ తర్వాత మాట మార్చారని, ఇన్నాళ్లు నోరుమెదపని రాష్ట్ర మంత్రులు ఇప్పుడు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు.    

విభజన చట్టం కూడా ఒడిసిపోయిందా?
విభజన చట్టం కూడా ఒడిసిపోయిన సబ్జెక్టేనని సీఎం కేసీఆర్‌ అంటారా అని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. విభజన హామీల అమలు కోసం తాను సుప్రీంకోర్టులో పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదని చెప్పారు. తెలంగాణ నుంచి తమకు సమాధానం రావడం లేదని కేంద్రం చెబుతోందని, విభజన చట్టం అమల్లో రాష్ట్ర ప్రయోజనాలున్నాయనే విషయాన్ని కూడా టీఆర్‌ఎస్‌ గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు