వైఎస్సార్‌ ఆశయ సాధనే కాంగ్రెస్‌ ధ్యేయం

7 Oct, 2018 12:19 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో షబ్బీర్‌ అలీ

ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తాం

టీఆర్‌ఎస్‌ అడ్రస్సు గల్లంతు కావాలి

రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీపై తొలి సంతకం

శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ

భిక్కనూరు(కామారెడ్డి జిల్లా): ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కలలు గన్న ఇందిరమ్మ రాజ్యం.. రైతు రాజుగా బతకాలనే దివంగత సీఎం వైఎస్సార్‌ ఆశయ సాధనే ధ్యేయంగా కాంగ్రెస్‌ పనిచేస్తుందని శాసన మండలి విపక్ష నేత, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. శనివారం భిక్కనూరులోని పాత ఎస్సీ కాలనీ, గిద్ద ఎస్సీకాలనీ, తిప్పాపూర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిశ్శబ్ద ప్రజా సునామీ ఉందని, ఈ సునామీలో టీఆర్‌ఎస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతు అవుతుందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు.

ఇంటికో ఉద్యోగం అని చెప్పి తన ఇంట్లో నలుగురికి రాజకీయ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మహిళలపై కేసీఆర్‌కు ఎలాంటి గౌరవం లేదని, మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదన్నారు. కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూంలు కట్టిస్తానని చెప్పి ఆ హామీని నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీపై తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ కలలు గన్న రైతు రాజ్యం సాధనకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 

తిప్పాపూర్‌లో ప్రచారం ప్రారంభించడం లక్కీచాంప్‌ 
తిప్పాపూర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం తనకు లక్కీచాంప్‌ అని షబ్బీర్‌ అలీ అన్నారు. 1989, 2004లో కూడా తిప్పాపూర్‌ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి విజయం సాధించానని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఈ గ్రామంలో ఉన్నప్పుడే ఎన్నికల తేదీ డిసెంబర్‌ 7గా ఈసీ ప్రకటించిందని తెలిపారు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే మొదటగా తిప్పాపూర్‌కు వచ్చి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతానన్నారు.   

మరిన్ని వార్తలు