కూల్చివేతలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు

12 Jul, 2020 03:26 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో ప్రార్థనా స్థలాలను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో శనివారం మాజీ మంత్రి, మండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్‌ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం షబ్బీర్‌ అలీ విలేకరులతో మాట్లాడుతూ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని రెండు మసీదులు, ఒక ఆలయం కూల్చివేత పూర్తిగా చట్టవిరుద్ధమని, అన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ మొత్తం తన వ్యక్తిగత జాగీరుగా చూస్తున్నారని, ఆయనకు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉం దని అన్నారు. మొదటి దశ నిరసనలో తమ తమ నివా సాల వద్ద నల్ల జెండాలను ఎగురవేయాలని కాంగ్రెస్‌ పార్టీ తన కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందని చెప్పారు. 

బ్లాక్‌ మాస్క్‌లు, బ్లాక్‌ బ్యాడ్జీలు ధరించి అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ హైకమాండ్‌ను సంప్రదించి రెండో దశలో నిరసన ఎలా తెలపాలో నిర్ణయిస్తామని చెప్పారు. సచివాలయంలోని ప్రార్థనా స్థలాలను కూల్చివేసినందుకు ముఖ్యమంత్రి తెలిపిన విచారాన్ని తాము తిరస్కరిస్తున్నట్టు షబ్బీర్‌ అలీ చెప్పారు. ఈ క్షమాపణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌ వెలుపల సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను తగలబెట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ సిటీ కాంగ్రెస్‌ కమిటీ మైనారిటీ విభాగం చైర్మన్‌ సమీర్‌వలీ ఉల్లా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జాఫర్‌ జావీద్, ప్రతినిధి సయ్యద్‌ నిజాముద్దీన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.అఫ్జలుద్దీన్, నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఫిరోజ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు