నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ 9 స్థానాలు గెలుస్తుంది

8 Dec, 2018 13:34 IST|Sakshi

మహాకూటమిదే అధికారం అంటున్న కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం పలు జాతీయ న్యూస్‌ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ అంచనాలను కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి తొమ్మిది స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ సర్వేలు ఎలా ఉన్నా.. ప్రజలు సర్వేలు చూసి ఓట్లు వేయరని తెలిపారు.

మహాకూటమిదే అధికారం
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ స్పందిస్తూ.. మహాకూటమికి 70 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. లగడపాటి రాజగోపాల్‌ సర్వేను మించి కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమికి సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఓట్లు భారీగా గల్లంతు అయ్యాయని, ఈ విషయమై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.  ఎన్నికల్లో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు