ఆమెను చూసి సిగ్గుపడాల్సిందే..!

18 Apr, 2019 14:20 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ఓటింగ్‌ శాతానికి పెంచేందుకు  ప్రభుత్వాలు తీవ్ర కసరత్తే చేస్తున్నాయి.  అంతకంతకూ  ఓటు వేసే వారి సంఖ్య దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో  పోలింగ్‌ రోజు సెలవిచ్చి మరీ ఓటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో పోలింగ్‌కు బూత్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది.  అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు రెండవ విడత పోలింగ్‌లో భాగంగా  కర్ణాటక, మంగళూరులోని ఓ యువతి  స్ఫూర్తిగా నిలిచారు.  

దివ్యాంగురాలైన షబ్బిత మోనిష్‌ ఓటు వేసిన తీరు పలువురిని  అబ్బుర పర్చింది. రెండు చేతులు లేని షబ్బిత  పోలింగ్‌  కేంద్రానికి తరలి వచ్చారు. ఓటు వేసినందుకు గుర్తుగా వేసే ఇంక్‌ గుర్తును కాలి బ్రొటన వేలిపై వేయించుకున్నారు.  అటు బెంగళూరులోని జయనగర్‌  పోలింగ్‌ బూత్‌లో వృద్ధ దంపతులు శ్రీనివాస్‌ (91) మంజుల (84) తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.  ఓటు హక్కును వినియోగించుకోవడానికి చొరవ చూపని దేశ పౌరులు, దివ్యాంగులు, అంధులను, వృద్ధులను చూసి  సిగ్గు పడాల్సిందేనని నెటిజన్లు  వ్యాఖ్యానిస్తున్నారు.  

కాగా కర్టాటకలో మధ్యాహ్నం 1 గంటకు  21.47 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదుకాగా,  తమిళనాడులో 39.49శాతంగా ఉంది.  వీటితోపాటు దేశవ్యాప్తంగా అసోం, బిహార్‌, జమ్ము కశ్మీర్‌, మణిపూర్‌ తదితర  రాష్ట్రాల్లో  రెండవ విడత పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు