ఈడీ చార్జిషీటులో షబ్బీర్‌ అలీ!

25 Oct, 2017 02:59 IST|Sakshi

మాంసం వ్యాపారి ఖురేషీకి కోటిన్నర ఇచ్చినట్లు కోర్టుకు వెల్లడి

నాకేం తెలీదు.. ఏ నోటీసులు రాలేదు: షబ్బీర్‌ అలీ  

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: వివాదాస్పద మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీపై మనీ ల్యాండరింగ్‌ కేసుపై చార్జిషీటు దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. ఇందులో తెలంగాణ కాంగ్రెస్‌ నేత, శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ పేరును చేర్చింది. సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ సమర్పించిన చార్జిషీటులో.. షబ్బీర్‌ అలీ లంచం ఇవ్వజూపారని పేర్కొంది. ‘సతీశ్‌ సానా అనే వ్యాపారవేత్తతో ఢిల్లీ వెళ్లిన షబ్బీర్‌ అలీ మనీ ల్యాండరింగ్‌ కోసం మొయిన్‌ ఖురేషీకి కోటిన్నర ఇచ్చారు’ అని ఈడీ చార్జిషీటులో పేర్కొంది.

అయితే, ఈ వార్తలను షబ్బీర్‌ అలీ ఖండించారు. ‘నేను అక్రమాలకు, వివాదాలకు దూరంగా ఉంటాను. మొయిన్‌ ఖురేషీ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నా పేరు ఎందుకు చార్జిషీటులో ఉంటుంది. నాకు ఖురేషీతో సంబంధాలున్నాయని ఈడీ చెబుతుంటే.. ఖురేషీ అబద్ధమైనా ఆడుతూ ఉండాలి. లేదా ఈడీ అర్థరహితమైన ఆరోపణలు చేస్తుండాలి. ఇంతవరకు నాకు ఎలాంటి నోటీసులూ అందలేదు. నోటీసులొచ్చాక దీనిపై స్పందిస్తా’ అని ఆయన తెలిపారు.

ఈ కేసుతో సంబంధమున్న వారందరిపైనా విచారణకు అనుమతించాలని ఈడీ తరపు న్యాయవాది ఎన్‌కే మట్టా కోర్టును కోరారు. మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఖురేషీ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. కాగా, సీబీఐ కేసునుంచి బయటపడేందుకు సాయం చేస్తానంటూ ఓ వ్యాపారి వద్దనుంచి రూ. 5.75 కోట్లను మొయిన్‌ ఖురేషీ వసూలు చేసినట్లు (ఈడీ) చార్జిషీట్‌లో పేర్కొంది.

‘ఓ వ్యాపారి, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ కేసునుంచి బయటకు తీసుకొస్తానని.. సీబీఐ డైరెక్టర్‌ (అప్పటి చీఫ్‌ ఏపీ సింగ్‌ పేరును ప్రస్తావిస్తూ) తనకు తెలుసని వ్యాపారిని నమ్మించాడు. అతనినుంచి రూ. 5.75 కోట్లు వసూలు చేశాడు. మరో వ్యాపారికీ ఇదే విధంగా చెప్పి రూ.1.75 కోట్లు తీసుకున్నాడు’ అని ఈడీ పేర్కొంది. ఏపీ సింగ్, ఖురేషీ సహా పలువురిపై మనీల్యాండరింగ్‌ సహా పలు నేరారోపణలను ఈడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు