రెండింట్లో షాద్‌నగర్‌

21 Mar, 2019 15:00 IST|Sakshi
షాద్‌నగర్‌ పట్టణం వ్యూ

ప్రత్యేకత చాటుకుంటున్నషాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ 

రంగారెడ్డి పరిధిలో ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌ జిల్లాలో లోక్‌సభ స్థానం  

1952లో మహబూబ్‌నగర్‌ను లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. అప్పట్లో షాద్‌నగర్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలోనే ఉండేది. ఆ తర్వాత 1967లో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ కేంద్రంగా ఏర్పాటుచేసి షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ను దానిలో కలిపారు. అప్పటి నుంచి 2004 వరకు నాగర్‌కర్నూల్‌ పరిధిలోనే షాద్‌నగర్‌ ఉండేది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో నాగర్‌కర్నూల్, పరిగి, కొడంగల్, అచ్చంపేట, షాద్‌నగర్‌ నియోజకవర్గాలు ఉండేవి. అయితే 2009లో తిరిగి షాద్‌నగర్‌ను మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మహబూబ్‌నగర్‌ పరిధిలో షాద్‌నగర్‌ ఉంది. అయితే 2016లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిపేశారు.  

అసెంబ్లీ రంగారెడ్డి, లోక్‌సభ మహబూబ్‌నగర్‌లో 
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఓటువేసిన షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు లోక్‌సభ ఎన్నికలకు మాత్రం ఓటును మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వేస్తున్నారు. దీంతో షాద్‌నగర్‌ రెండు జిల్లాల రాజకీయాలకు వారధిగా మారింది. పలు సందర్భాల్లో ఎంపీల గెలుపోటములను శాసించిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. 
పార్లమెంట్‌ ఎన్నికల్లో షాద్‌నగర్‌ 

  • 1952లో పాలమూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉన్న సమయంలో మూడు ఎన్నికలు జరిగాయి. 1952లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కె.జనార్దన్‌రెడ్డి, 1957, 62లో రామేశ్వర్‌రావు ఎంపీగా విజయం సాధించారు. వారి గెలుపులో షాద్‌నగర్‌ నియోజకవర్గానికి కూడా భాగస్వామ్యం ఉంది.  
  • 1967లో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాక అదే ఏడాది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జేబీ ముత్యాలరావు విజయం సాధించడంలో షాద్‌నగర్‌ కీలక పాత్ర పోషించింది.  
  • 1971, 77లలో వరుసగా రెండుసార్లు తెలంగాణ ప్రజా సమితి నుంచి పోటీ చేసిన భీష్మదేవ్‌ విజయం సాధించారు.  
  • 1980లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మల్లు అనంతరాములు, 1984లో తులసీరాం, 1989లో మల్లు అనంతరాములు విజయం సాధించారు. 1989లో మల్లు అనంతరాములు మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు మల్లు రవి గెలుపొందారు. మల్లురవి విజయంలోనూ షాద్‌నగర్‌ భాగమైంది.  
  • 1996లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మందా జగన్నాథం విజయం సాధించారు. 
  • 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మల్లురవి తిరిగి విజయాన్ని అందుకున్నారు. 
  • 1999, 2004లో వరుసగా రెండుసార్లు మందా జగన్నాథం విజయం సాధించగా ఈ విజయాల్లోను షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కీలక పాత్ర పోషించింది.  
  • 2009లో తిరిగి షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని మళ్లీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో కలిపారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆయన గెలుపులోను షాద్‌నగర్‌ కీలకంగా మారింది.  
  • అయితే 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నుంచి పోటీ చేసిన జితేందర్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అత్యధిక మెజార్టీ ఇచ్చిన షాద్‌నగర్‌కే దక్కడం గమనార్హం. 

ప్రత్యేక శ్రద్ధ 
షాద్‌నగర్‌ నియోజకవర్గంలో వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతం వారు ఎక్కువ ఉండడంతో ఎంపీ అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు షాద్‌నగర్‌ నియోజకవర్గానికి అభ్యర్థులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు