‘షహీద్’ అనాలా, ‘మార్టైర్’ అనాలా!?

11 Mar, 2019 17:34 IST|Sakshi

సాక్షివెబ్ ప్రత్యేకం: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికులకు షహీద్ లేదా మార్టైర్ హోదాను కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విశయం తెల్సిందే. సైన్యంలో అలాంటి హోదా లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ పుల్వామా దాడిలో మరణించిన సైనికుల గురించి మోదీ ప్రస్తావించినప్పుడల్లా వారిని ‘షహీద్’ అని అంటున్నారు. గతంతో భారత సైనికులు మరణించినప్పుడు ‘మార్టైర్’ అని వ్యవహరించారుగానీ ‘షహీద్’ అని వ్యవహరించలేదు. అయితే బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారిని ‘షహీద్’గా వ్యవరించారు. అందుకు ఉదాహరణ భారత స్వాతంత్య్ర సమర యోధుడు ‘షహీద్ భగత్ సింగ్’. ఆయన గురించి 1965లో ‘షహీద్’ పేరిట మనోజ్ కుమార్ నటించిన, 2002లో బాబీ డియోల్ నటించిన ‘షహీద్’ సినిమాలు వచ్చాయి.

షహీద్ అనే పదం హిందీ పదంగా, మార్టైర్ పదం ఇంగ్లీషు పదంగా నేడు చెలామణి అవుతోంది. తెలుగులో ఈ పదాలకు ‘అమర వీరుడు’గా వ్యవహరిస్తున్నారు. తెలుగు వ్యవహారంలో ఇది మంచి పదమేగానీ సమానార్థం కాదు. ‘షహీద్’ పదం అరబిక్ నుంచి రాగా, ‘మార్టైర్ అనే పదం గ్రీకు మూలం నుంచి వచ్చింది. ఈ రెండు పదాలకు సమానార్థం సాక్షి. ఆది నుంచి ఇస్లాం మతంతో షాహిద్, క్రైస్తవ మతంతో మార్టైర్ అనే పదాలు అల్లుకు పోయాయి.

‘మార్టైర్’ పరిణామ క్రమం
‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చి’ ప్రకారం మార్టైర్ అంటే ‘సాక్షి’ అని అర్థం. క్రైస్తవంలో ప్రధాన మత బోధకుడిని, ఏసు క్రీస్తు ప్రధాన అనుచరులను మార్టైర్ గా పేర్కొనే వారు. అంటే మత బోధనల్లో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన ప్రత్యక్ష సాక్షి అనే అర్థంలోనే అలా పిలిచేవారు. మత ప్రచారం కోసం ఎవరైనా మరణిస్తే లేదా ప్రాణాలర్పిస్తే వారి మార్టైర్ గా వ్యవహరించడం కాలక్రమంలో వచ్చింది. క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే నాటి రోమన్లు క్రైస్తవ ప్రచారకులపైకి సింహాలను వదిలేవారు. వాటి చేతుల్లో మరణించిన వారిని మారై్టర్స్గా పిలిచేవారు. ‘బైబిల్’ రెండో భాగమైన ‘న్యూ టెస్టామెంట్’లో మార్టైర్ గురించి ఎక్కువగా ఉంది. మార్టైర్ అంటే మరణించిన వారికన్నా, ప్రధాన మత బోధకులనే అలా ఎక్కువగా వ్యవహించడం అందులో కనిపిస్తుంది.

షహీద్ పరిణామ క్రమం
అరబిక్ మూలం నుంచి వచ్చిన ‘షహీద్’ సమానార్థం ‘సాక్షి’యే అయినప్పటికీ మత ప్రచారంలో భాగంగా ప్రాణాలను కోల్పోయిన వారినే ‘షహీద్’లుగా ఎక్కువగా పేర్కొంటున్నారు. ‘ఖురాన్’లో సాక్షి అనే అర్థంలోనే షహీద్ పదాలను వాడారు. ముస్లింలలో ముఖ్యంగా షియా తెగవారు మరణించిన వారిని ‘షహీద్’లుగా పేర్కొంటున్నారు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం మరణించే వారంతా వారి దృష్టిలో షహీద్లే.

‘హుతాత్మా’ అంటే ఏమిటీ ?
షాహిద్, మార్టైర్ అనే రెండు పదాలు కూడా రెండు మతాలకు సంబంధించినవి కావడం వల్ల దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికులను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పదాలతో పిలవరాదని ‘హిందూత్వ’ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర వీరుడు అనే అర్థంలో మరాఠీ మూలం నుంచి ‘హుతాత్మ’ అనే సంస్కృత పదాన్ని కాయిన్ చేశారు. దక్షిణ ముంబైలో అమర వీరుల స్మారక స్థూపానికి ‘హుతాత్మ చౌక్’ అని పేరు పెట్టారు.

ప్రపంచ చరిత్రలో కోకొల్లలు
భారత దేశం సెక్యులర్ దేశమని, సెక్కులర్ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు మరణిస్తే ‘మార్టైర్’ పదాన్ని ఉపయోగించరాదని 2017లో సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ వాదించారు. కానీ ప్రపంచ చరిత్రలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారిని మార్టైర్స్గా పేర్కొనడం ఉంది. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియా రాజ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన హంగేరియన్లను, 20వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన ఐరిష్ అమర వీరులను మార్టైర్స్గా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అభ్రహాం లింకన్ హత్య తర్వాత పది రోజులకు ఆయన నిజమైన దేశభక్తుడైనందున ఆయనకు మార్టైర్ హోదా కల్పించాలంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ డిమాండ్ చేసింది. మార్టిన్ లూథర్ కింగ్ను ‘అహింసా మార్టైర్’గా వాషింఘ్టన్ పోస్ట్ వ్యవహరించింది.

మన సైన్యం ఏమంటుంది ?
మన భారత దేశ సైనిక పరిభాషలో దేశం కోసం మరణించిన సైనికులను ‘బాటిల్ క్యాజువాలిటీ లేదా ఆపరేషన్స్ క్యాజువాలిటీ’ అని వ్యవహరిస్తున్నారు. అంతకుమించి ఎలాంటి విశేషణాలు వాడడం లేదు.

(గమనిక: అమర వీరులను సావర్కర్ సూచించినట్లు ‘హుతాత్మలు’గా వ్యవహరించాలంటూ హిందూత్వ వాదులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరింత స్పష్టత కోసం ఈ వ్యాసం)

మరిన్ని వార్తలు