జీవీఎల్‌పై చెప్పు: ఎవరీ శక్తి భార్గవ!

18 Apr, 2019 18:59 IST|Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు జీవీఎల్‌ నరసింహారావు ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయనపై శక్తి భార్గవ అనే వ్యక్తి చెప్పు విసిరేశాడు. జీవీఎల్‌పై ఆగ్రహంతో చెప్పు విసిరిన ఈ శక్తి భార్గవ ఎవరని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులు, అక్రమ సంపద ఉందనే ఆరోపణలతో ఆయనపై గతంలో ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది.

భార్గవ ఆస్పత్రుల అధినేత అయిన శక్తి భార్గవకు పలు కంపెనీలు ఉన్నాయి. శక్తి భార్గవ ఇటీవల మూడు భవనాలు కొనుగోలు చేశాడు. ఇందుకోసం తన ఖాతా నుంచి రూ. 11.5 కోట్లు చెల్లించాడు. తన భార్య, పిల్లలు, బంధువులు ఇలా పలువురి పేర్ల మీద ఆయన బంగ్లాలు కొన్నాడు. అయితే, తనకు తాను శక్తి భార్గవ విజిల్‌ బ్లోయర్‌గా చెప్పుకుంటుండగా.. అతని తల్లిదండ్రులు మాత్రం అతనిపైన, అతని భార్యపైన వేధింపుల కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ బంగ్లాలు తాము కొనుగోలు చేశామని, కానీ, అక్రమ వ్యవహారాల ద్వారా ఆ మూడు బంగ్లాలను తన భార్య, పిల్లలు, బంధువుల పేర్ల మీదకు శక్తి భార్గవ బదలాయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రూ. 11 కోట్లు పెట్టి తాము భవనాలు కొనుగోలు చేస్తే.. వాటిని అక్రమమార్గంలో రూ. 11.5 కోట్లకు కొన్నట్టు శక్తిభార్గవ కొన్నాడని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

అయితే, శక్తిభార్గవ లాయర్‌ అభిషేక్‌ అత్రే మీడియాతో ఆయన మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని, ఆయనకు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆయన ప్రవర్తనతో విసిగిపోయి గతంలోనే ఆయనకు లాయర్‌గా సేవలందించడం మానేశానని అత్రే తెలిపారు. 2018లో లక్నో, కాన్పూర్‌, వారణాసిలోని శక్తిభార్గవ నివాసాలు, కార్యాలయాలపై ఐటీశాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఐటీ శాఖ రూ. 28 లక్షలు, రూ. 50 లక్షలు విలువచేసే నగలు స్వాధీనం చేసుకుంది. మూడు బంగ్లాలకు సంబంధించి దాదాపు రూ. 10 కోట్ల ఆదాయానికి సంబంధించి లెక్కలను ఐటీ శాఖ విచారణలో శక్తి భార్గవ చెప్పలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన, ఆయన బంధువుల పేరిట ఉన్న ఎనిమిది కంపెనీలకు సంబంధించిన వివరాలు ఆదాయపన్నుశాఖకు, ప్రభుత్వ ఏజెన్సీలకు తెలుపలేదని ఐటీ విచారణలో గుర్తించారు.

మరిన్ని వార్తలు