దళిత చైర్‌పర్సన్‌కు అవమానం

1 Mar, 2018 09:22 IST|Sakshi
మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ని నిల్చోబెట్టే విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ

విలేకరుల సమావేశంలో కుర్చీ కేటాయించని వైనం

సమావేశం యావత్తూ నిలుచునే ఉన్న నాయుడుపేట పట్టణ ప్రథమ పౌరురాలు

సాక్షి, నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీలో దళితులకు ఇచ్చే ప్రాధాన్యమెంతో మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శోభారాణిని నిలబెట్టే ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం గోమతినగర్‌లోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్‌ రంగారెడ్డి, కార్పొరేటర్‌ రాజానాయుడు పాల్గొన్నారు. వీరందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడే ఉన్న నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శోభారాణికి మాత్రం కుర్చీ కేటాయించలేదు. దీంతో ఆమె సమావేశం జరుగుతున్నంత సేపూ నాయకుల వెనుక నిల్చొనే ఉండాల్సి వచ్చింది. మంత్రి నారాయణ తదితర టీడీపీ నేతలు చైర్‌పర్సన్‌ నిలుచుని ఉన్నా పట్టించుకోకుండా విలేకరుల సమావేశం ముగించారు.

మరిన్ని వార్తలు