ఇది తెలంగాణకే అవమానం

18 Sep, 2018 03:08 IST|Sakshi
బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కె.లక్ష్మణ్‌. చిత్రంలో కిషన్‌రెడ్డి

     విమోచన దినోత్సవాన్ని జరపకపోవడంపై లక్ష్మణ్‌ విమర్శలు

     ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

     ఏమి తెలియని వారే విలీనం అంటున్నారు: దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్‌: అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం ప్రసంగించారు. నిజాం పాలనలో జరిగిన అరాచకాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదన్నారు. షోయబుల్లాఖాన్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలాంటి వారెందరో నిజాం బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం పోరాడారని చెప్పారు. వేలాది మంది పోరాటంలో బలిదానాలు చేశారన్నారు.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోలీసు యాక్షన్‌ ద్వారా తెలంగాణ ప్రాంతానికి విమోచన జరిగిందని వివరించారు. ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేలా ఉమ్మడి రాష్ట్రంలో ప్రయత్నాలు జరిగాయని, తెలంగాణ వచ్చాక కూడా అదే జరుగుతోందన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఎంఐఎం ఒత్తిడికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లొంగడాన్ని తెలంగాణ ప్రజలు సహించబోరన్నారు. జలియన్‌ వాలాబాగ్‌ను తలపించే ఘటనలు ఆనాడు అనేకం జరిగాయని, ఇందుకోసం బైరాన్‌పల్లి, పరకాల సంఘటనలు రెండు ఉదాహరణలు మాత్రమేనని చెప్పారు. 

విమోచనం జరిపే ధైర్యం లేదు: దత్తాత్రేయ
తెలంగాణ పోరాటాల గడ్డ అని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. నిజాం పాలనకు వ్యతరేకంగా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన దినం గురించి మాట్లాడే హక్కు కమ్యూనిస్టులకు లేదని, తెలంగాణ ఉద్యమం గురించి తెలియవారు ఇది విమోచనం కాదు.. విలీనం అని అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చింది టీఆర్‌ఎస్‌ కాదని, ఆ పార్టీకి విమోచనం జరిపే ధైర్యం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు