సంతోషంగా బీసీలు

21 Jul, 2020 04:38 IST|Sakshi
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శంకరనారాయణ. చిత్రంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ ప్రజాప్రతినిధులు

బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది 

ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్నిటిలో పెద్దపీట.. బీసీల సంక్షేమానికి కొత్తగా 28 కార్పొరేషన్లు 

టీడీపీ బీసీలను బిజినెస్‌ క్యాస్ట్‌గా మాత్రమే చూసింది  

మంత్రులు శంకర్‌ నారాయణ, ధర్మాన కృష్ణదాస్‌ 

సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని చూసి వారంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్‌ నారాయణ అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో బీసీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యయన కమిటీని వేశారన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి శంకర్‌ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ వర్కుల్లో, మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ కల్పించారు.   
– స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. కేబినెట్‌లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.  
– ఈ నెల 20 బీసీలకు పండుగ రోజు. బీసీల సంక్షేమానికి 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 30 వేల జనాభా మించిన బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తాం.   
– కొత్తవాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలనే పరిగణనలోకి తీసుకోగా, ఇప్పుడు మొత్తం 139 కులాలు కవర్‌ అవుతున్నాయి.  
– వైఎస్సార్‌ చేయూత ద్వారా సింహభాగం లబ్ధి బీసీ మహిళలకే జరుగుతుంది.  
– గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పారు.  
– బీసీలంతా వైఎస్‌ జగన్‌ వెంటే ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.   
 
చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారు: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ 

– 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.  
– టీడీపీ బీసీలను బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్‌ క్యాస్ట్‌గా చూసింది.  
– వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల లబ్ధి జరిగింది. 
– ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని అన్నారు.  
– ఎమ్మెల్యే జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్యాస్ట్‌ అని భావించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసిందన్నారు.   
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మధుసూదన్‌ యాదవ్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా