వర్షపు హోరు.. పవార్‌ హుషారు

20 Oct, 2019 04:35 IST|Sakshi
జోరువానలో ప్రసంగిస్తున్న శరద్‌ పవార్‌

సతారా: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌(80) చేవతగ్గలేదని మరోసారి నిరూపించారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్రచారం ఆఖరి రోజైన శనివారం సతారాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. ఈ సందర్భంగా శరద్‌ పవార్‌ పార్టీ అభ్యర్థి ఎంపికలో తప్పు చేసినట్లు అంగీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తప్పు చేస్తే ఒప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఎంపికలో తప్పు చేశా. ఆ విషయాన్ని మీ ముందు అంగీకరిస్తున్నా. కానీ, ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది.

21న జరగనున్న పోలింగ్‌ కోసం సతారా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో ఎన్‌సీపీకి వరుణ దేవుడి ఆశీస్సులు కూడా లభించాయి. వరుణుడి కటాక్షంతో సతారా ప్రజలు అద్భుతం సృష్టించబోతున్నారు’అని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మిగతా నేతలంతా వర్షంలో తడవకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఆయన ఆగలేదు. తడుస్తూనే ప్రసంగం కొనసాగించారు. పోరాట యోధుడు కాబట్టే శరద్‌ పవార్‌ 5 దశాబ్దాలుగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కాగా, సతారా ఉప ఎన్నికకుగాను ఛత్రపతి శివాజీ వంశీకుడు ఉదయన్‌ భోసాలేకు ఎన్‌సీపీ టికెట్‌ కేటాయిం చింది. ఆయన అనంతరం బీజేపీ తీర్థం పుచ్చు కుని, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

మరిన్ని వార్తలు