విద్యారంగ సమస్యలకు పవార్‌ సూచనలు

20 May, 2020 16:33 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ట్విటర్‌ వేదికగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. శరద్ పవార్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్దవ్‌ ఠాక్రేతో చర్చించినట్లు పేర్కొన్నారు. విద్యాసంవత్సరం ఆలస్యం వల్ల టీచర్లు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. లాక్‌డౌన్‌ వల్ల సాంకేతిక విద్యాసంస్థలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. కొన్ని విద్యాసంస్థలు ఆర్థిక భారంతో మూసివేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని నిమమించాలని సూచించారు.

విద్యార్థులు, టీచర్లు, విద్యాసంస్థలు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా పరిశ్రమలు, పోర్టులు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు మంత్రులు, నిపుణులు పరిశ్రమ యజమానులకు నమ్మకం కలిగించాలని తెలిపారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు దాదాపు 35 వేల కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 20 వేల మంది వైరస్‌ బారిన పడగా.. పుణె, థానే, నవీ ముంబై, ఔరంగాబాద్‌లో మహమ్మారి కోరలు చాస్తూ ప్రకంపనలు కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు