థర్ట్‌ పార్టీ విచారణ కోసం కేంద్రానికి లేఖ రాస్తా.. 

1 Nov, 2018 04:23 IST|Sakshi
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ నేతలకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టీకరణ  

కేంద్ర దర్యాప్తు సంస్థలే విచారణ జరపాలి  

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై జాతీయ నేతల డిమాండ్‌  

సీతారాం ఏచూరి, పవార్, శరద్‌ యాదవ్‌లతో వైఎస్సార్‌సీపీ నేతల భేటీ  

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కుట్రపై థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ తానే స్వయంగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు బుధవారం ఢిల్లీలో పలువురు జాతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన గురించి వారికి తెలియజేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, బాలశౌరి బుధవారం తొలుత సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం గురించి తెలియజేశారు.

ఈ ఘటనపై టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం సాగిస్తోందని, కేసు విచారణను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అనంతరం ఎల్‌జేడీ చీఫ్‌ శరద్‌యాదవ్‌తోనూ భేటీ అయ్యారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్న వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్‌కు సీతారాం ఏచూరి, శదర్‌యాదవ్‌ మద్దతు పలికారు. ‘‘వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలి’’అని శరద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు భేటీ అయ్యారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రపై థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ తానే స్వయంగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని శరద్‌ పవార్‌ చెప్పినట్టు విజయసాయిరెడ్డి వెల్లడించారు.  

నేరం కప్పిపుచ్చుకొనేందుకే బాబు ఢిల్లీ యాత్ర  
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై చేసిన హత్యాయత్నం కుట్రను కప్పిపుచ్చుకొనేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జాతీయ నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నేరం చేసిన ప్రతిసారి ఇలా ఢిల్లీ వచ్చి, జాతీయ పార్టీల నేతలను కలిసి వారిని మభ్యపెట్టి, వ్యవస్థలను మేనేజ్‌ చేసే ప్రయత్నం చేస్తారని దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు పాత్ర లేకుంటే ఆయన ఒక వారంలోనే రెండుసార్లు ఢిల్లీ వచ్చి జాతీయ స్థాయి నేతలను కలవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ హత్యాయత్నం కుట్రకు చంద్రబాబే కర్త, కర్మ, క్రియ అని అన్నారు.  

టీడీపీ నేతలకు ఎందుకంత భయం? 
ఢిల్లీ యాత్రలు చేస్తూ జాతీయ స్థాయి నేతలను కలుస్తున్న చంద్రబాబు తీరును చూస్తే జగన్‌పై హత్యాయత్నం కుట్రలో చంద్రబాబే సూత్రధారి అనే విషయం అర్థమవుతోందని మాజీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు జాతీయ స్థాయి నేతలందరికీ తెలుసని చెప్పారు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు గత కొన్నేళ్లలో ఎంతమందితో పొత్తుపెట్టుకున్నాడు, అవసరం తీరిపోయాక ఎంతమందిని వదిలేశాడో అందరికీ తెలుసని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని, అబద్ధాలకోరని, అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరన్న విషయం ఢిల్లీలో అందరికీ తెలుసన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రపై థర్డ్‌ పార్టీ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు అంతలా భయపడుతున్నారని మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు వారంలో రెండుసార్లు ఢిల్లీ వచ్చి, తాము ఈ కుట్ర చేయలేదని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటని నిలదీశారు. తాము రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం లేదన్నారు.   

మరిన్ని వార్తలు