మహా ట్విస్ట్‌: శరద్‌ పవార్‌ స్పందన

23 Nov, 2019 10:06 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతునివ్వడం తన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ’ఈ రోజు ఉదయం ఏడు గంటలకే నాకు ఈ విషయం తెలిసింది. అజిత్‌ పవార్‌ ఇలా చేస్తాడని నాకు తెలియదు. నేను త్వరలోనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను. ఉద్ధవ్‌ ఠాక్రే కూడా మీడియాతో మాట్లాడతారు. అప్పుడే అన్ని విషయాలు వివరంగా చెబుతాను’ అని పేర్కొన్నారు. అదే విధంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అజిత్‌ పవార్‌ వ్యక్తిగత నిర్ణయం అని, దీంతో ఎన్సీపీకి ఎటువంటి సంబంధం లేదని శరద్‌ పవార్‌ ట్వీట్‌ చేశారు. అజిత్‌ నిర్ణయాన్ని తాము స్వాగతించడం లేదని పేర్కొన్నారు.(చదవండి : బిగ్‌ ట్విస్ట్‌: సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణం)

కాగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్‌ పవార్‌ ప్రకటించిన తరుణంలో అజిత్‌ పవార్ ఆయనకు ఊహించని షాకిచ్చారు. ఆయనకు 20కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో బీజేపీకి మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి పదవి కోసమే శరద్‌ పవార్‌ బీజేపీకి మద్దతు ఇచ్చారంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అజిత్‌ పవార్‌ తమకు వెన్నుపోటు పొడిచారని శివసేన ఆరోపించగా, ఎన్సీపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోందంటూ కాంగ్రెస్‌ విమర్శించింది.(అమ్మ పవార్‌.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా? )

మరిన్ని వార్తలు