ఠాక్రేను విమర్శించిన పవార్‌

15 Feb, 2020 08:56 IST|Sakshi
ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌పవార్‌ (ఫైల్‌)

కొల్హాపూర్‌/పుణే: మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్‌–ఎన్సీపీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ మొదటిసారి విమర్శలు చేశారు. కోరెగావ్‌–భీమా అల్లర్ల కేసును రాష్ట్ర పోలీసుల నుంచి ఎన్‌ఐఏకు బదిలీ చేయడంపై ఆయన శుక్రవారం మండిపడ్డారు. ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేస్తూ పుణే కోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన ఈ విమర్శలు చేశారు. కేసును బదిలీ చేయడంపై తమకేమీ అభ్యంతరం లేదని ప్రాసిక్యూషన్‌ చెప్పడంతో కేసు బదిలీ అయింది. ఇలా చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదమని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

పుణే పోలీసులు విచారిస్తున్న కేసును కేంద్రం తీసుకోవడం కూడా సరికాదని అన్నారు. ఇది రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిన అంశమని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రిగా ఉన్న ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. కోరెగావ్‌–భీమా అల్లర్ల కేసును ఎన్‌ఐఏకు అప్పగించే ముందు రాష్ట్ర  ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. (చదవండి: ‘మాది స్వచ్ఛమైన హిందుత్వ’)

మరిన్ని వార్తలు