ఆదిరెడ్డీ.. ఎమ్మెల్సీ మా భిక్షే

3 Apr, 2018 12:39 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న షర్మిలారెడ్డి తదితరులు

మహిళలను చులకన చేసిమాట్లాడతావా?

కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ షర్మిలారెడ్డి ధ్వజం

రాజమహేంద్రవరం సిటీ : ‘ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే మా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి భిక్షే. ఆ పదవిని అనుభవిస్తూ కౌన్సిల్‌లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తూ మహిళలను దూషిస్తూ, చులకన చేసి మాట్లాడుతున్నారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ బడ్జెట్‌ అంకెల గారడీ. అభివృద్ధిని ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు’అంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంకెల గారడీగా ఉన్న నగర పాలకసంస్థ బడ్జెట్‌కు మేయర్‌ రజనీశేషసాయి.. సభ్యులతో మమ అనిపించారన్నారు. ప్రారంభ, ముగింపు నిల్వల్లో కనీసం ఐదు శాతం నిధులు లేకుండానే బడ్జెట్‌ తయారైందని, తొమ్మిది రూపాయల లోటు చూపించారన్నారు. గతేడాది బడ్జెట్‌ కన్నా ఈ ఏడాది పెరగాల్సిన ఆదాయం చూపలేదన్నారు. ప్రజలపై పన్నుల భారం పెంచిన తరువాత కూడా ఆదాయం కనిపించలేదాని ఆమె ప్రశ్నించారు.

నిధులు తెచ్చుకోవడంలో జీరో అయ్యారు
మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కార్పొరేషన్‌కు నిధులు తెచ్చుకోవడంలో జీరోలు అయిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. సంస్థకు వచ్చే గ్రాంటులు రూ.13.22 కోట్లు మాటేమిటన్నారు. నగరాభివృద్ధికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో అధికార పార్టీ డీలా పడిందన్నారు.

మేయర్‌కు ఎందుకీ పక్షపాతం?
బడ్జెట్‌ సమావేశం సమయంలో పింఛన్ల విషయం మాట్లాడవద్దని మేయర్‌ అన్నారని, వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్న డివిజన్‌ల్లో పేదలకు పింఛన్లు అందక అవస్ధలు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. తన డివిజన్‌లో 95 పింఛన్లు దరఖాస్తుల్లో 25 మంజూరు కాలేదన్నారు. నగరంలోని 50 డివిజన్‌ల్లో చాలామంది పేదలున్నారని, ఒక్క మేయర్‌ డివిజన్‌లోనే లేరన్నారు.

పుష్కర నిధులు ఏమయ్యాయి?
నగరానికి పుష్కరాల్లో రూ.240 కోట్లు మంజూరైతే రూ.120 కోట్లు మాత్రమే వచ్చాయని మిగిలిన నిధులు ఏమయ్యాయోనని, రావాల్సిన నిధులపై కౌన్సిల్‌లో ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. నిధుల విషయంలో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ వర్రే కార్పొరేషన్‌కు రాసిన లేఖకు సమాధానం రావాల్సి ఉందన్నారు. పుష్కర నిధులపై ప్రశ్నిస్తే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మహిళలను దూషిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ రూ.120 కోట్లలో రూ.60 కోట్లు మాత్రమే ఇంజనీరింగ్‌ అధికారులు ఖర్చు చేశారని ఆమె తెలిపారు.

సన్‌ ఆఫ్‌ ఎమ్మెల్సీ.. కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు సన్‌ ఆఫ్‌ ఎమ్మెల్సీ మాదిరిగా అధికారిక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని 4వ డివిజన్‌ కార్పొరేటర్, నగర ఇంజినీరింగ్‌ కమిటీ చైర్మన్‌ బొంతా శ్రీహరి విమర్శించారు. దీనిపై అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. టీడీపీ సొంత రాజ్యాంగం రాసుకుని పాలన చేస్తోందని, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే బయటకు పొండని అంటున్నారని, ఇక చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పార్టీ అధినేత పాదయాత్రను వర్రే శ్రీనివాస్‌ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, పార్టీ బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, కొమ్ము జిగ్లర్, ఆనంద్, శ్యాంబాబు, బాలకృష్ణ, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుదగ్గర మార్కుల కోసమే..
సీఎం చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేందుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మహిళలను చులకనగా.. ఏకవచనంతో మాట్లాడారని ఆమె ఆరోపించారు. గతంలో మాతో పాటు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడడం దారుణమన్నారు.

మరిన్ని వార్తలు