‘నేనలా అంటే.. మీడియా మరోలా రాసింది’

15 Oct, 2018 20:32 IST|Sakshi

రామమందిరంపై వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు : శశిథరూర్‌

సాక్షి, న్యూఢిల్లీ :  'బాబ్రీ మసీదు స్థలంలో ఆలయాన్ని నిజమైన హిందువు ఎవరూ కోరుకోరు’ అనే వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ వివరణ ఇచ్చారు. కొందరు పేరు మోసిన రాజకీయ నాయకుల సేవలో తరించే కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యల్ని వక్రీకరించాయని ట్విటర్‌లో ఆరోపించారు. ‘రాముడు జన్మించిన చోట ఆలయం నిర్మించాలని చాలామంది హిందువులు కోరుకుంటారనీ, కానీ మరొక ప్రార్థనాలయాన్ని కూల్చి నిర్మించాలని నిజమైన హిందువు కోరుకోడు’ అని వ్యాఖ్యానించినట్టు చెప్పుకొచ్చారు.

ఆదివారం చెన్నైలో జరిగిన  'ఇండియా: అంశాలు, అవకాశాలు' అనే అంశంపై హిందూ లిట్ ఫర్ లైఫ్ డైలాగ్ 2018 కార్యక్రమంలో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై తన అభిప్రాయాలు మాత్రమే చెప్పానని థరూర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదనీ, తాను పార్టీ అధికార ప్రతినిధిని కాదని స్పష్టం చేశారు. కాగా, శశిథరూర్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ స్పందించారు. ఆలయ నిర్మాణాన్ని డిమాండ్‌ చేస్తూ అయోధ్యలో టెంట్లు వేసుకుని మరీ రామునికి పూజలు చేస్తున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమంటారా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే హిందూ జపం చేసే కాంగ్రెస్‌ వైఖరి శశిథరూర్‌ వ్యాఖ్యలతో వెల్లడైందంటూ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చురకలంటించారు.

మరిన్ని వార్తలు