ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు!

28 Nov, 2019 14:53 IST|Sakshi

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశ భక్తుడంటూ సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే ప్రశంసలు గుప్పించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజ్ఞా వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో  బీజేపీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆమెను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి తప్పించడమే కాకుండా.. ఈ పార్లమెంట్‌ సమావేశాల వరకూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొనకుండా బహిష్కరించింది.

మరోవైపు ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తోంది. ఇప్పటికే ప్రజ్ఞా వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ ఖండించగా.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశి థరూర్‌ కూడా స్పందించారు. ప్రజ్ఞాసింగ్‌ క్షమాపణ చెప్పేవరకు పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదని డిమాండ్‌ చేశారు. ‘‘బీజేపీ వాళ్లు ఆమెకు టికెట్‌ ఇచ్చారు. ఎంపీని చేసి పార్లమెంటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమెను పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి బహిష్కరించడం వల్ల ఏం లాభం? తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేవరకు ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు. ఈ విషయమై సెన్సార్‌ మోషన్‌కు మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని శశి థరూర్‌ అన్నారు.

నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడిన ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఉగ్రవాదైన ప్రజ్ఞా సింగ్‌ మరో ఉగ్రవాది గాడ్సేను దేశభక్తుడని కొనియాడారని, ఇది దేశ పార్లమెంట్‌ చరిత్రలోనే విచారకరమైన దినమని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలను ఖండించారు.

మరిన్ని వార్తలు