‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హిందూ పాకిస్తానే’

12 Jul, 2018 09:13 IST|Sakshi

తిరువనంతపురం : కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే భారత్‌దేశం కాస్తా ‘హిందూ పాకిస్తాన్‌’ గా మారుతోందని ఆరోపించారు. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మన ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమలుకు నోచుకోదు. బీజేపీ వారి ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని తయారుచేసుకుంటుంది. దాని ద్వారా మైనార్టీల హక్కులు అణచివేయబడతాయి. వారికి సమాన గౌరవం ఉండదు. అది భారత్‌ని కాస్తా హిందూ పాకిస్తాన్‌గా మార్చేందుకు దోహదపడుతోంది. మహాత్మ గాంధీ, నెహ్రు, సర్దార్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌ వంటి స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలకు అది విరుద్దమని’ తెలిపారు.

కాగా శశిథరూర్‌ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర డిమాండ్‌ చేశారు. వారి లక్ష్యాల కోసమే కాంగ్రెస్‌ పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ఇప్పటికి భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, హిందువులకు చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు