‘కాంగ్రెస్‌ పార్టీలో ఆర్థిక సంక్షోభం నిజమే’

25 May, 2018 16:18 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ స్పందించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీ సహకారం కావాలి. విరాళాలు అందించి మాకు సహాయం చేయండి అంటూ’ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ట్వీట్‌ను ఆయన సమర్థించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన థరూర్‌.. ‘ప్రస్తుతం అత్యధిక విరాళాలు అందుకుంటున్న పార్టీ బీజేపీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అధికారం ఉన్న వారి దగ్గరికే డబ్బు కూడా వెళ్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ చిన్నపాటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీ’ అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు చాలా మంది సొంత డబ్బే ఖర్చు చేశారు. ఒకవేళ మేము పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించడంలో విజయం సాధించినట్లైతే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇదే ఫలితం పునరావృతమవుతుందంటూ’  శశి థరూర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా  నివేదిక ప్రకారం బీజేపీ రూ.1034.27 కోట్ల ఆదాయం కలిగి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి తెలిపినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) తన నివేదికలో పేర్కొంది. గతంలో పోలిస్తే ఈసారి బీజేపీ ఆదాయం రూ. 463.41 కోట్లమేర పెరిగిందని తెలిపింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదాయం 14 శాతానికి పడిపోయినట్లు పేర్కొంది. ఇక ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అత్యంత ధనిక పార్టీ అని, ఎస్పీ తర్వాత తమిళ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) రెండో స్థానంలో ఉందని ఏడీఆర్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు