ఫైర్‌బ్రాండ్‌కు ‘రెబల్‌’ మద్దతు

13 Feb, 2018 17:52 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ‘రెబల్‌’ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శస్త్రాలు ఎక్కుపెట్టారు. విపక్ష కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా నవ్వినందుకు బీజేపీ నాయకులు ఆమెను రామాయణంలోని తాటాకితో  పోల్చి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శత్రుఘ్నసిన్హా ట్విటర్‌లో స్పందించారు.

రేణుక ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎవరేమన్నా పట్టించుకోవద్దని, తనను చూసి ఏడ్చేవారిని ఏడవనివ్వాలని సూచించారు. మహిళా సాధికారతను వ్యతిరేకించేవాళ్లు త్వరలోనే పతనమవుతారని వ్యాఖ్యానించారు. వారికి ఇదే చివరి నవ్వు అవుతుందని పేర్కొంటూ నారీ శక్తికి జై కొట్టారు.

బీజేపీకి తలనొప్పిలా తయారైన శత్రుఘ్నసిన్హా ఇంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకులను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. బీజేపీ అగ్రనాయకులపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నాయకులను వెనకేసుకొచ్చారు.

మరిన్ని వార్తలు