కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా

6 Apr, 2019 13:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్‌ నేత, బీజేపీ రెబల్‌ ఎంపీ శత్రుఘ్న సిన్హా శనివారం కాంగ్రెస్‌ పార్టీలో అధికారికంగా చేరారు. కాంగ్రెస్‌  ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సుర్జీవాలాల సమక్షంలో సిన్హా కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీని వీడటం బాధాకరమే అయినా బరువెక్కిన గుండెతో ఆ పార్టీని వీడుతున్నానని వరుస ట్వీట్లలో ఆయన పేర్కొన్నారు.

బీజేపీ వ్యవస్ధాపక దినం రోజే ఆ పార్టీని వీడటం బాధాకరమని, బీజేపీ నుంచి ఎందుకు వైదొలగుతున్నాననేది మీ అందరికీ తెలుసునని సిన్హా అన్నారు. బీజేపీతో తన పయనంలో తనను బాధించిన వారిని మన్నిస్తానని స్పష్టం చేశారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి దిగ్గజ నేతల మార్గదర్శకత్వంలో తాను బీజేపీలో ఎదిగానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చేందుకు బాధ్యులైన వారితో పాటు పార్టీ విధానాలతో తనను సరిపడక పోవడంతో బీజేపీని వీడటం మినహా తనకు మరో మార్గం లేకుండాపోయిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల సంక్షేమానికి, ఐక్యతకు తాను కృషిచేసేలా తనకు అవకాశం ఇస్తుందని సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు