రెబెల్‌.. స్టార్‌ తిరిగేనా!

7 Apr, 2019 10:05 IST|Sakshi

శత్రుఘ్న ప్రవేశంతో వేడెక్కిన రాజకీయం..

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో ఢీ

సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌ : శత్రుఘ్న సిన్హా రంగప్రవేశంతో పట్నా సాహిబ్‌ నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ఢీకొనేందుకు శత్రుఘ్న సమాయత్తమవుతున్న తరుణంలో దేశంలోకెల్లా అత్యంత ఉత్కంఠ పోరు నెలకొన్న నియోజకవర్గంగా పట్నా సాహిబ్‌ అవతరించబోతోంది.

బీజేపీతో పాతికేళ్లకు పైగా ఉన్న బంధాన్ని శత్రుఘ్న సిన్హా తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి సొంత సీటు పట్నా సాహిబ్‌ నుంచి లోక్‌సభకు బరిలోకి దిగుతుండడంతో ఇప్పటి వరకూ సిన్హా భవిష్యత్తుపై కొనసాగిన సస్పెన్స్‌ తొలగిపోయింది. వాజ్‌పేయి సర్కారులో మంత్రిగా పనిచేసిన సిన్హా ‘బిహారీ బాబు’గా ఉన్న జనాదరణతో రెండుసార్లు రాజ్యసభకు (1996, 2002), మరో రెండుసార్లు లోక్‌సభకు బీజేపీ టికెట్‌పై ఎన్నికయ్యారు.

మోదీ కేబినెట్‌లో మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ను మే 19 జరగనున్న ఎన్నికల్లో ఢీకొననున్నారు. దాదాపు 22 ఏళ్లు బీజేపీ తరఫున పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన శత్రుఘ్న కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడం ఇదే ప్రథమం. 1970ల్లో రెబెల్‌ స్టార్‌గా సంచలనం సృష్టించిన శత్రు.. పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పొందిన శిక్షణతో రాణించారు. ప్రతినాయకుని పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. రాజకీయాల్లో ఎలాంటి శిక్షణ లేకున్నా 1992లో న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ టికెట్‌పై తొలిసారి పోటీకి దిగారు.

కాంగ్రెస్‌ తరఫున పోటీపడిన తోటి బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ ఖన్నా చేతిలో 28 వేలకు పైగా ఓట్ల తేడాతో శత్రుఘ్న ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలో రాజేష్, శత్రు భార్యలు డింపుల్‌ కపాడియా, పూనమ్‌ సిన్హా భర్తల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.

1996లో రాజ్యసభకు..
1992 జూన్‌ ఉప ఎన్నికలో ఓడినా కానీ బీజేపీ తరఫున చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా సిన్హాను 1996లో రాజ్యసభకు నామినేట్‌ చేశారు. మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా 2002లో ఆయన రెండోసారి రాజ్యసభకు బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఉండగా ఆయన 2003 జనవరి నుంచి 2004 మే వరకూ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, షిప్పింగ్‌ మంత్రిగా పనిచేశారు.

2008 నియోజకవర్గాల పునర్విభజనతో బిహార్‌ రాజధానిలో కొత్తగా ఏర్పాటైన పట్నా సాహిబ్‌ నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు సిన్హా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆర్జేడీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను లక్షా 66 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. మళ్లీ 2014లో బీజేపీ తరఫునే పోటీచేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కుణాల్‌సింగ్‌ను 2 లక్షల 65 వేలకు పైగా ఓట్లతో ఓడించారు.

పార్లమెంటులో బీజేపీ ఎంపీగా 17 ఏళ్ల అనుభవంతో ఇంత మెజారిటీతో గెలిచినా మోదీ కేబినెట్‌లో చోటు దక్కకపోవడం శత్రుçఘ్న బీజేపీలో ‘రెబెల్‌ స్టార్‌’గా మారడానికి దారితీసింది. వాజ్‌పేయి కేబినెట్‌లో సిన్హా సహచరుడైన యశ్వంత్‌ సిన్హాతో చేతులు కలిపారు. కొన్నేళ్లుగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బీజేపీని, మోదీని మరింత ఇరుకున పెట్టడానికి బీజేపీ బద్ధ శత్రువు, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ను సిన్హా అనేకసార్లు కలిశారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, మోదీ ద్వయం వల్లే తనకు మంత్రి పదవి, ప్రాధాన్యం లేకుండా పోయిందనే కసితో కాంగ్రెస్‌లో చేరిన రోజు కూడా సిన్హా వారిపై బాణాలు సంధించారు. ‘బీజేపీ ఒన్‌ మ్యాన్‌ షో (మోదీ ఏకపాత్రాభినయం), ఇద్దరు సిపాయిలతో కూడిన సేన’గా మారిందని శత్రు వ్యాఖ్యానించారు. 

ఇద్దరు కాయస్థుల మధ్య రసవత్తర పోటీ!
సిన్హాకు టికెట్‌ ఇవ్వడం లేదనే విషయం సూటిగా చెప్పకుండా కేంద్ర మంత్రి, సిన్హా కులానికే (కాయస్థు ) చెందిన రవిశంకర్‌ప్రసాద్‌ను పట్నాసాహిబ్‌కు తమ అభ్యర్థిగా రెండు వారాల క్రితమే బీజేపీ ప్రకటించింది. 2000 నుంచి వరుసగా రాజ్యసభకు ఎన్నికైన ప్రసిద్ధ లాయర్‌ ప్రసాద్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ఠాకూర్‌ ప్రసాద్‌ బీజేపీ పూర్వ రూపం జనసంఘ్‌ స్థాపక సభ్యుల్లో ఒకరు.

ఈ నియోజకవర్గంలో కాయస్థులతోపాటు అగ్రవర్ణాల జనాభా దాదాపు 28 శాతం వరకూ ఉంది. వారిలో బీజేపీకి మద్దతుదారులు ఎక్కువ. కాయçస్థు ఓట్లలో అధిక శాతం ప్రసాద్‌కే పడతాయని అంచనా. ఆర్జేడీతో పొత్తు వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న యాదవుల ఓట్లు, కాయస్థుల ఓట్లు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి సిన్హాకు లభిస్తాయని భావిస్తున్నారు. 2014లో కాయస్థులు చాలా వరకూ బీజేపీ అభ్యర్థి సిన్హాకే ఓటేశారు.

ఈసారి ప్రసాద్‌కు ఆ స్థాయిలో ఈ కులస్తుల మద్దతు లభించకపోవచ్చనీ, కాయస్థులు, ఇతర అగ్రకులాల ఓట్లు చీలిపోతాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌–ఆర్జేడీ కూటమిలో (మహాగఠ్‌బంధన్‌)లో భాగం కావడం వల్ల శత్రుఘ్న నుంచి ప్రసాద్‌కు గట్టి పోటీ తప్పదనీ, సీఎం నితీశ్‌కుమార్‌ (జేడీయూ) మద్దతు ఉన్నా కూడా.. బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తే తప్ప విజయం దక్కదని కొందరు జోస్యం చెబుతున్నారు.

ఓటర్లు : 20,51,905
అసెంబ్లీ సెగ్మెంట్లు : 6 
(బక్తియార్‌పూర్, దీఘా, బంకీపూర్, కుంహ్రార్, పట్నాసాహిబ్, ఫాతుహా.. వీటిలో మొదటి ఐదు సీట్లను 2015 ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోగా, ఫాతుహాలో ఆర్జేడీ గెలిచింది). 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు