కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు ఓడింది.. కారణం ఇదే!

20 Jan, 2018 12:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన మౌలిక వసతుల అభివృద్ధిని, ప్రగతిని తొలిసారి ఓటర్లు తేలికగా తీసుకొని.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు మద్దతు ఇచ్చారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైన కీలకాంశాల్లో ఇది ఒకటి.. అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అభిప్రాయపడ్డారు. ఈ నెల 27న జైపూర్‌ సాహిత్యోత్సవంలో విడుదల కాబోతున్న తన ఆత్మకథ ‘సిటిజెన్‌ ఢిల్లీ: మై టైమ్స్‌, మై లైఫ్’లో పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ ఓటర్లు మా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను గుర్తించలేదు. నేను అధికారంలోకి రాకముందు ఢిల్లీ ఎలా ఉందో వారికి తెలియదు అని ఆమె పేర్కొన్నారు.

‘ఓటర్లలో తొలిసారి ఓటు హక్కు వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. 15 ఏళ్ల కిందట ఢిల్లీ ఎలా ఉందో వారు చూడలేదు. ఢిల్లీలోని నిరంతర విద్యుత్‌, ఫ్లైఓవర్లు, మెట్రోరైలు, పలు కొత్త యూనివర్సిటీలు అన్ని కూడా తమ సహజమైన హక్కులుగా వారు భావించారు. వాటిని పెద్దగా లెక్కచేయలేదు. ఆ సంతోషకర భావన అన్నది వారిలో వ్యక్తం కాలేదు’ అని దీక్షిత్‌ రాసుకొచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయాల్లోకి రావడాన్ని కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని, ప్రజల మనోభావాలను అతను ఓట్లుగా మలుచుకుంటాడని భావించలేదని ఆమె అంగీకరించారు. ‘నేనే స్వయంగా ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ స్థానాన్ని 25వేల ఓట్ల మెజారిటీతో అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతిలో ఓడిపోయాను. ఆప్‌ను మేమంతా తక్కువగా అంచనా వేశాం’ అని పేర్కొన్నారు. 2010 కామన్‌వెల్త్‌ క్రీడల్లో అవినీతి ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన షుంగ్లూ కమిటీ ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని విస్మరించిందని నిందించారు.

మరిన్ని వార్తలు