జన్మభూమి అట్టర్ ఫ్లాప్: శిల్పా

9 Jan, 2018 19:55 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పాదయాత్ర సూపర్ హిట్.. జన్మభూమి అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించారు. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం సూదేపల్లి గ్రామంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అన్నారు. జన్మభూమి సభల్లో జనాలు లేరన్న విషయాన్ని టీడీపీ గుర్తించాలన్నారు. అధికార పార్టీ నాయకులు జన్మభూమికి వెళ్లలేని పరిస్థితి ఉందని, వాస్తవాలు ఒప్పుకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్ధాయిలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తున్నామని, సమన్వయంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అరెస్టులు దారుణం
నాలుగేళ్ళ టీడీపీ పాలనలో చేసింది శూన్యమని వైఎస్సార్‌సీపీ  కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య అన్నారు. అభివృద్ధిపై బహిరంగ సవాల్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదని, బహిరంగ చర్చకు టీడీపీ నాయకులు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలకు మాత్రమే జన్మభూమి కార్యక్రమం వల్ల ఉపయోగమన్నారు. ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు.

మరోసారి మోసం
జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజలను మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు