రాజీనామా చేయించే దమ్ము ఉందా?

20 Feb, 2018 11:59 IST|Sakshi
మాట్లాడుతున్న శిల్పాచక్రపాణిరెడ్డి

ప్రత్యేక హోదాపై పెదవి విప్పరేం?

శిల్పా చక్రపాణి రెడ్డి

రాయపాడు(గోస్పాడు): ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మంత్రులను రాజీనామా చేయించే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా అని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. మండలంలోని రాయపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..దీంతో టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు.  కులాల మధ్య చిచ్చు పెట్టడడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.

టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని మాట్లాడిన మంత్రి ఆదినారాయణరెడ్డి  గంటల వ్య«వధిలోపే మాట మార్చడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 22మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.  నిజాయితీ, నిబద్ధత ఉంటే వారిచేత రాజీనామాలు చేయించాలన్నారు. దమ్ము, ధైర్యం, నిజాయితీ, నైతిక విలువలు తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నాయన్నారు.  అందుకే తన చేత రాజీనామా చేయించి వైఎస్సార్‌సీపీలోకి చేర్చుకున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జననేతను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నేత శిల్పార విచంద్రకిశోర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ  సభ్యుడు ప్రహాల్లాదరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మధుసూదన్‌రెడ్డి, యాసం రామసుబ్బారెడ్డి, కౌన్సిలర్‌ అనిల్‌అమృతరాజు, ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

ప్రత్యేక హోదాపై పెదవి విప్పరేం?: బీజేపీ, టీడీపీ మంత్రులను ప్రశ్నించిన శిల్పా చక్రపాణిరెడ్డి  
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడడంతోపాటు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు యత్నిస్తుండగా.. టీడీపీ, బీజేపీ మంత్రులు ఎందుకు పెదవి విప్పడం లేదని పార్టీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని జలవనరుల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ మంత్రులు, కేంద్రంలో టీడీపీ మంత్రులు నాటకాలాడుతున్నారని విమర్శించారు. పదవులు పట్టుకుని వేలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి పోరాడదామని తెలుగుదేశం పార్టీకి సూచించినా.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతామనే భయంతో టీడీపీ నేతలు ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం.. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందో.. వాటిని ఎలా ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక, పూర్తిగా రుణమాఫీకాక.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇందుకు ప్రభుత్వమే కారణమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారో చెప్పేందుకు టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా పదవులను కాపాడుకునే ప్రయత్నంలోనే టీడీపీ నాయకులున్నారన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా