పార్టీ మారిన మీరు శుద్ధి చేసుకోవాలి..

26 Apr, 2018 11:26 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిరెడ్డి

మహానంది/బండి ఆత్మకూరు: ‘రైతులను రాజులుగా చూడాలన్న ధ్యేయంతో మహానేత వైఎస్సార్‌ ప్రాజెక్టులు కట్టించారు. సిద్ధాపురం వద్ద మేము సర్వమత ప్రార్థనలు చేసి గంగమ్మతల్లికి హారతి పూజలు నిర్వహిస్తే.. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు సంప్రోక్షణ, శుద్ధి చేపట్టడం బాధాకరం. పార్టీ మారిన మీరు ముందుగా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాల’ని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని తన నివాసంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల యువనాయకుడు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వరరెడ్డితో కలిసి మహానంది, బండిఆత్మకూరు మండలాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టుల అభివృద్ధికి వైఎస్సార్‌ ఎంతో కృషి చేశారన్నారు. సిద్ధాపురం వద్దనే కాదని,  జిల్లాలో వైఎస్‌  చేపట్టిన ప్రతి ప్రాజెక్టు వద్ద వైఎస్సార్‌ గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

తాము సర్వమత ప్రార్థనలు చేసి వైఎస్సార్‌ గంగా హారతి ఇస్తే.. అక్కడ టీడీపీ నేతలు సంప్రోక్షణ చేయడం అన్ని మతాలవారిని కించపరచడం కాదా అని ప్రశ్నించారు. సంప్రదాయాలను గౌరవించలేని వ్యక్తులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌ గంగాహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలు, నాయకులు, పార్టీ, వైఎస్సార్‌ అభిమానులు, నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా తరలివచ్చి అభిమానాన్ని చాటుకున్నారన్నారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ఎరువుల ధరలు అధికంగా ఉండటంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర తరహాలో రైతులు ఉద్యమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. అధికార పార్టీని గద్దె దించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ కలిసి  ప్రజలను మోసం చేశాయన్నారు.కావున ఈ నెల 30న విశాఖపట్నంలో వంచన దీక్ష  చేపడుతున్నామని తెలిపారు. 

పార్టీ బలోపేతానికిప్రత్యేక ప్రణాళికలు
పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో బలోపేతం చేస్తామని శిల్పా తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 26 నుంచి మే  10వ తేదీ వరకు బూత్‌ కన్వీనర్ల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రణాళికల మేరకు అన్ని నియోజకవర్గ నేతలు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మహానంది మండల మాజీ అధ్యక్షుడు నాగభూపాల్‌రెడ్డి,   నాయకులు గోపవరం అశోక్‌రెడ్డి, చంద్రారెడ్డి, దేవస్థానం మాజీ ధర్మకర్తలు నరాల చంద్రమౌళీశ్వరెరెడ్డి, బండి శ్రీనివాసులు, భక్తశేషారెడ్డి, శరభారెడ్డి, మద్దిలేటి, తిరుమల, రమణ, చంద్ర, మహానంది మనోహర్‌రెడ్డి, బండిఆత్మకూరు మండల మాజీ అ«ధ్యక్షుడు దేసు వెంకటరామిరెడ్డి, నాయకులు జగన్‌ మోహన్‌రెడ్డి,  చిన్నబాబు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

కాటసాని రాకను స్వాగతిస్తున్నాం
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఈ నెల 29న వైఎస్సార్‌ పార్టీలోకి రానున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. ఆయన రాకను స్వాగతిస్తున్నామన్నారు. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. అందరినీ కలుపుకుని.. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ కొత్తగా వచ్చేవారిని చేర్చుకుంటామన్నారు. జిల్లాలో కొందరు టీడీపీ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. 

మరిన్ని వార్తలు