బాబు చేతిలో ‘పవన్‌’ కీలుబొమ్మ

11 Dec, 2017 12:28 IST|Sakshi

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుకున్నా ప్రశ్నించరా?  

హామీలపై నోరు మెదపరెందుకు? 

వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి 

ఆత్మకూరు(కర్నూలు):  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి చేతిలో సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ కీలుబొమ్మగా మారాడని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ , బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌.. వచ్చే ఎన్నికల్లోనైనా పోటీ చేస్తారా లేదో ప్రజలకు తెలపాలన్నారు. ఓటు నోటు కేసులో సీఎం చంద్రబాబు ఇరుక్కున్నా..ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీలకు 2 ఎకరాల భూమి లాంటి చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

రిజర్వేషన్ల కోసం పాదయాత్ర చేస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేస్తే ఎందుకు స్పందించలేదన్నారు. సొంత సామాజికవర్గ నేతకు మద్దతు ఇవ్వని పవన్‌ కళ్యాణ్‌ ఇతరుల గురించి ప్రశ్నించడం సరికాదన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వివిధ కులాలను మభ్య పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శ్రీశైలం నియోజకవర్గం తన కృషితో అభివృద్ధి చెందిందన్నారు. పెద్దాపురం ఎత్తిపోతల పథకంతోపాటు ఆత్మకూరు పట్టణానికి రూ. వంద కోట్లతో మంచినీటి పథకం మంజూరుకు కృషి చేసినట్లు వివరించారు. శ్రీశైలం నియోజకవర్గంలో పక్కాగృహాల విషయంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అందరికీ ఇళ్లు పూర్తయ్యాకే శ్రీశైలం నుంచి తరలించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భువనేశ్వర్‌ రెడ్డి, బండి ఆత్మకూరు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మద్దిలేటి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు