రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు: శిల్పా రవిచంద్రారెడ్డి

18 Dec, 2019 20:10 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రారెడ్డి స్వాగతించారు. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే జరుగుతుందని ఆయన అన్నారు. రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు అని ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి బుధవారమిక్కడ విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో కరువు పోయిందని అన్నారు. సీమ ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని అన్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లా అభివృద్థి అంతా ఒకే దగ్గర కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మాట మార్చారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లాగానే అమరావతిని చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, అభివృద్ధి హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వల్లే రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నోసార్లు సీమ బిడ్డగా హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కోరామన్నారు. సీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలను చంద్రబాబు మాయ మాటలతో మోసం చేశారని ధ్వజమోత్తారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కొన్ని మెరిగే కుక్కలను పక్కన పెట్టుకుని సీఎం జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారన్నారు.

‘‘సీమలో పుట్టిన చంద్రబాబుకు అక్కడ మూడు సీట్లు వచ్చాయంటే ఆయన పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. రాయలసీమ ప్రజల ఆకాంక్షను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చుతున్నారు. సోషల్‌ ఎకనామిక్‌ సర్వే ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి. జీఎన్‌రావు కమిటీ నివేదిక కూడా ప్రజాభిప్రాయం మేరకే వస్తుందని భావిస్తున్నా. సీఎం జగన్‌ నిర్ణయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకులమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలి. రాజధానిలో చంద్రబాబు తాను కొన్న భూములకు రేట్లు తగ్గిపోతాయని భయపడుతున్నారు. ఇక జేసీ దివాకర్‌ రెడ్డిని జేసీ దివాకర్‌ రెడ్డి అనాలో ...జానీ వాకర్‌ దివాకర్‌ రెడ్డి అనాలో అర్థం కావడం లేదు. రెండు పెగ్గులు వేస్తే ఏమి మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు.’’ అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

మరిన్ని వార్తలు